Rajiv Shukla : అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భారత స్టార్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) బరిలోకి దిగనున్నారు. ఈ సిరీస్‌లో దంచేశారంటే సరే. లేదంటే ఈ లెజెండరీ క్రికటర్ల భవితవ్యం ఏంటీ? వచ్చే వరల్డ్ కప్ ఆడుతారా? .. వంటి ప్రశ్నలు అభిమానుల బుర్రలో మెదులుతున్నాయి. ఇటీవలకాలంలో సెలెక్టర్లు కుర్రాళ్లకు పెద్ద పీట వేస్తున్నందున ఈ దిగ్గజ ఆటగాళ్లు కెరీర్ ఇంకెన్ని రోజులు కొనసాగనుంది? అనేది తెలియడం లేదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajiv Shukla) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘రోహిత్ శర్మ, కోహ్లీలకు ఆస్ట్రేలియా పర్యటన ఎంతో ఉపయోగపడనుంది. వారిద్దరు గొప్ప ఆటగాళ్లు. అనుభవజ్ఞులైన వీరి సమక్షంలో ఆస్ట్రేలియాను ఓడిస్తాం. అందరూ అనుకుంటున్నట్టు రోకోకు ఇదే ఆఖరి సిరీస్ కాదు. అలా అనీ ఎవరూ చెప్పలేదు. ఇప్పుడే మేము దిగ్గజ ఆటగాళ్ల వీడ్కోలు గురించి ఆలోచించడం లేదు. చెప్పాలంటే.. ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాలి? అనేది పూర్తిగా క్రికెటర్ల నిర్ణయం.
అందుకే.. మళ్లీ చెబుతున్నా హిట్‌మ్యాన్, కోహ్లీకి ఇదే ఆఖరి సిరీస్ కాదు’ అని ఎన్ఐఏతో శుక్లా వెల్లడించాడు. ఆయన మాటలతో కోహ్లీ, రోహిత్ మరో వన్డే సిరీస్ ఆడడంపై అయితే క్లారిటీ వచ్చేసింది అభిమానులకు. ఇక రావాల్సిందల్లా వరల్డ్ కప్‌లో ఆడుతారా? లేదా? అనే అంశంమీదనే.
ఐపీఎల్ 18వ సీజన్ తర్వాత టీమిండియా జెర్సీ వేసుకోని విరాట్ రోహిత్ ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమవుతున్నారు.
50 ఓవర్ల ఫార్మాట్లో ఘనమైన రికార్డు కలిగిన రోకో.. ఆసీస్‌పై చెలరేగాలని భావిస్తున్నారు. వచ్చే వన్డే వరల్డ్ కప్ సన్నద్ధతలో ఉన్న భారత జట్టుతో పాటు రోహిత్, కోహ్లీలకు కూడా ఈ సిరీస్ కీలకం. ఇప్పటికే టెస్టులకు, టీ20లకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు కొనసాగుతున్న ఏకైక ఫార్మాట్ ఇదే. అందుకే వీరిని ప్రపంచ కప్ ఆడించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ, టోర్నీకి ముందు వీరి ఫామ్, ఫిట్నెస్ను బట్టి సెలెక్టర్లు నిర్ణయం తీసుకోనున్నారు.