న్యూఢిల్లీ, అక్టోబర్ 14 : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి దేశవ్యాప్తంగా కుటుంబ ఆదాయ సర్వేను నిర్వహించనున్నది. దేశవ్యాప్తంగా ఆదాయ పంపిణీ, అందులోని అసమానతలను అర్థంచే సుకుని దాన్ని భర్తీ చేయడమే లక్ష్యంగా జాతీయ కుటుంబ ఆదాయ సర్వే(ఎన్హెచ్ఐఎస్)ను ప్రభుత్వం నిర్వహించ సంకల్పించింది. తన పరిధిలోని జాతీయ గణాంక కార్యాలయం(ఎస్ఎస్ఓ) ద్వారా కేంద్ర గణాంకాల, కార్యక్రమ అమలు మంత్రిత్వశాఖ(ఎంఓఎస్పీఐ) ఈ సర్వేను నిర్వహిస్తుంది. కుటుంబ ఆదాయ, వ్యయాల నమూనాలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఆదాయ వనరులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్హెచ్ఐఎస్ సేకరించనున్నది. దేశవ్యాప్తంగా ఆదాయ వివరాలకు సంబంధించి ప్రత్యక్షంగా లభించే సమాచారంతో అసమానతలను అంచనా వేయడమే ఈ సర్వే లక్ష్యం.
సర్వే కోసం సన్నాహక చర్యలలో భాగంగా ఈ ఏడాది ఆగస్టులోనే దేశవ్యాప్తంగా 15 ప్రాంతీయ కార్యాలయాలలో ముసాయిదా ప్రశ్నావళితో ప్రయోగాత్మకంగా సర్వేను ఎంఓస్పీఐ నిర్వహించింది. న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలలో సంపన్నులు, పేదలు అధికంగా నివసించే వేర్వేరు ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సుర్జీత్ ఎస్ భల్లా అధ్యక్షతలోని సాంకేతిక నిపుణుల బృందం పర్యవేక్షించింది. తాము ప్రయోగాత్మకంగా నిర్వహించిన సర్వే ఫలితాలు, ఎన్హెచ్ఐఎస్ ముసాయిదా షెడ్యూల్‌పై ప్రజల సూచనలు, సలహాలను మంత్రిత్వశాఖ కోరుతోంది. పరిశోధకులు, విధాన రూపకర్తలు, పౌరులు అక్టోబర్ 30లోగా తమ సూచనలు అందచేయవచ్చు. ముఖ్యంగా వేతనాలు, స్వయం ఉపాధి ఆదాయం, ఆస్తుల ద్వారా లభించే ఆదాయం, చెల్లింపులకు సంబంధించి సూచనలను మంత్రిత్వశాఖ ఆహ్వానిస్తోంది.