జనగామ, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): దేవాదుల 8వ ప్యాకేజీలో భాగంగా జనగామ నియోజకవర్గంలోని తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి బచ్చన్నపేట, చేర్యాల, కన్నెబోయినగూడెం రిజర్వాయర్ నుంచి బచ్చన్నపేట, జనగామ మండలాల్లో అసంపూర్తిగా ఉన్న కాలువలను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. ఇందుకోసం రైతులకు భూసేకరణ నిధులను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన సమీక్షలో పల్లా మాట్లాడుతూ.. పలు అంశాలను మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
తపాస్‌పల్లి, కన్నెబోయినగూడెం రిజర్వాయర్ల నుంచి సీపేజీ ఎకువగా ఉన్న కారణంగా వెంటనే చర్యలు తీసుకొని దాన్ని నివారించి, గేట్లు, తూములను రిపేర్ చేసి అన్ని చెరువులను దేవాదుల నీటితో నింపాలని సూచించారు. జనగామ పరిధిలోని 12 చెరువులకు మరమ్మతు చేయించాలని తెలిపారు. మల్లన్నసాగర్ నుంచి తపాస్‌పల్లి గ్రావిటీ కాలువ పనులను పునరుద్ధరించాలని, నియోజకవర్గంలోని తరిగొప్పులలోని మినీ లిఫ్ట్-1 పనులకు సంబంధించి పైప్‌లైన్ పనులు పూర్తయినా మరికొన్ని చెరువులకు కూడా పైప్‌లైన్ వేయాలని, పంపుహౌస్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీటిని అందించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి సంక్రాంతిలోగా పనులు పూర్తి చేయాలని అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు.