Rahul Dravid : భారత జట్టుకు ఆడిన గొప్ప ఆటగాళ్లలో రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పేరు చిరస్థాయిగా నిలిచిపోతోంది. సుదీర్ఘ ఫార్మాట్లో తన జిడ్డు ఆటతో అరవీర భయంకర బౌలర్లకు సైతం పరీక్ష పెట్టిన అలుపెరగని ధీరుడు అతడు. బుల్లెట్ లాంటి బంతుల్ని అవలీలగా ఎదుర్కొనే సాహసిగా టీమిండియా చిరస్మరణీయ విజయాల్లో భాగమైన ద్రవిడ్.. వికెట్ కీపర్ అవ్వడం వెనక ఓ కథ ఉంది. అతడేమీ కావాలని గ్లోవ్స్ అందుకోలేదు. స్కూల్ జట్టులో ఆడడం కోసం వికెట్ కీపర్ అవతారం ఎత్తాడు. ఈ విషయాన్ని ద్రవిడే స్వయంగా వెల్లడించాడు.
టీమిండియాను టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిపిన ద్రవిడ్ కోచ్‌గానూ వైదొలిగాడు. ఇకపై ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ కోచ్‌గా ఎంపికైన ద్రవిడ్ తన కెరీర్ తొలినాళ్ల గురించి ఆసక్తికర విషయం పంచుకున్నాడు. ‘స్కూల్ క్రికెట్ జట్టులో గట్టి పోటీ ఉండేది. దాంతో, చోటు దక్కడం కష్టమైంది. ఓసారి నేను అంతర్ స్కూల్ సెలెక్షన్స్‌కు వెళ్లాను. అక్కడ వికెట్ కీపర్ అంటూ ఎవరూ లేరు. ఇక ఇదే మంచి అవకాశం అనుకొని నేను వికెట్ కీపింగ్ చేస్తాను అని చెప్పాను. అలా బ్యాటర్‌ను కాస్త.. వికెట్ కీపర్ అవతారం ఎత్తాను’ అని ద్రవిడ్ వెల్లడించాడు.
టీమిండియాకు ఎంపికైన ద్రవిడ్ మొదట్లో బ్యాటర్‌గానే కొనసాగాడు. అయితే.. 1999లో అతడికి దేశం తరఫున వికెట్ కీపర్‌గా అవకాశం వచ్చింది. నయన్ మోంగియా (Nayan Mongiya) గాయపడడంతో గ్లోవ్స్ వేసుకున్న ద్రవిడ్ వికెట్ల వెనకాల చక్కని ప్రతిభ కనబరిచాడు. 2003 వన్డే వరల్డ్ కప్‌లో కెప్టెన్ గంగూలీ మళ్లీ ద్రవిడ్‌కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించాడు. ఈ దిగ్గజ ఆటగాడు 73 వన్డేల్లో కీపర్‌గా సేవలందించాడు. 71 క్యాచ్‌లు పట్టడమే కాకుండా 13 మంది స్టంపౌట్ చేశాడు.
టీమిండియా క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), సౌరభ్ గంగూలీ(Sourabh Ganguly), మహమ్మద్ అజారుద్దీన్ (Azharuddin)లు దూకుడును నమ్ముకొని స్టార్ ఆటగాళ్లుగా పేరుతెచ్చుకుంటే.. ద్రవిడ్ మాత్రం తన సొగసైన ఆట, బలమైన టెక్నిక్‌తో టెస్టు స్పెషలిస్ట్‌గా మారాడు. ఆస్ట్రేలియా గడ్డపై 2008లో తొలి టెస్టు విజయంలో ద్రవిడ్ కీలక పాత్ర పోషించాడు. కంగారూ పేస్ దళాన్ని సమర్దంగా ఎదుర్కొంటూ పెర్త్ టెస్టులో 93 పరుగులతో టీమిండియాను గెలిపించాడు. ఇక భారత్.. దాయాది పాకిస్థాన్‌పై 2005లో తొలి సిరీస్ గెలవడంలో ద్రవిడ్ రోల్ ఉంది.
Walls don’t retire, they become monuments!
Happy birthday #RahulDravid .#TheWall pic.twitter.com/FrhCBvpd5t
— P C Mohan (@PCMohanMP) January 11, 2022
బౌన్సీ పిచ్‌లకు కేరాఫ్ అయిన దక్షిణాఫ్రికా గడ్డపై తొలి విజయాన్ని రుచి చూసిన కెప్టెన్ కూడా ద్రవిడే కావడం విశేషం. ఇంగ్లండ్ నేలపై 21 ఏండ్ల తర్వాత టీమిండియా తొలి సిరీస్ విజయం నమోదు చేయడం.. ఇవన్నీ ద్రవిడ్ కెరీర్లో గొప్ప మైలురాళ్లు. 2001లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో వీవీఎస్ లక్ష్మణ్(281)తో కలిసి ద్రవిడ్(180) ఆడిన చారిత్రాత్మక ఇన్నింగ్స్‌ను భారత అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. వీరిద్దరి వీరోచిత పోరాటంతో ఇండియా 171 పరుగులతో గెలుపొంది సిరీస్‌ను సొంతం చేసుకుంది.
రవిశాస్త్రి తర్వాత టీమిండియా కోచ్‌గా పగ్గాలు అందుకున్న ద్రవిడ్ అనతికాలంలోనే తనముద్ర వేశాడు. ఎల్లప్పుడూ ప్రశాంతంగా కనిపించే ద్రవిడ్ జట్టుకు దూకుడుగా, భయం లేకుండా ఆడడం అలవాటు చేశాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్‌లతో కలిసి జట్టును విజయాల పట్టించాడు.
నిరుడు భారత జట్టు రెండు ఐసీసీ ఫైనల్స్‌లో భంగపడింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) ఫైనల్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా(Australia) చేతిలో ఓడిపోయింది. అయితే..టీ20 వరల్డ్ కప్‌ను మాత్రం టీమిండియా ఒడిసిపట్టింది. దాంతో, ఓ ఆటగాడిగా ఐసీసీ ట్రోఫీ కలను అతడు కోచ్‌గా నిజం చేసుకున్నాడు.