Chidambaram : కౌలు రైతులను కాషాయ పాలకులు విస్మరించారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం ఆరోపించారు. పీఎం కిసాన్ యోజనను కౌలు రైతులకు వర్తింపచేయడం లేదని ఆరోపించారు. చిదంబరం సోమవారం చండీఘఢ్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దేశంలో మొత్తం సాగు భూమిలో 32 శాతం కౌలు రైతులు సాగుచేస్తున్నారని వివరించారు. రైతుల ప్రజాస్వామిక హక్కులను అణిచివేయడం బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరిని బహిర్గతం చేస్తోందని దుయ్యబట్టారు.
ఇక గత పదేండ్లుగా హరియాణలో పాలక బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యవసాయ రుణ వితరణలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కాగా, హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదని కేంద్ర మంత్రి, హరియాణ మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. కాంగ్రెస్తో పొత్తుకు ఏ పార్టీ ముందుకు రావడం లేదని చెప్పారు. రిజర్వేషన్లు, సిక్కులపై కాంగ్రెస్ నేతలు అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
హరియాణ సీఎం నయబ్ సింగ్ సైనీ నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని అన్నారు. హరియాణలోని ఝజర్లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిజర్వేషన్ల తొలగింపుపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికాలో చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఆలోచనలు బట్టబయలయ్యాయని అన్నారు. విదేశీ గడ్డపై రాహుల్ గాంధీ దేశాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటుగా మారిందని మండిపడ్డారు.
Read More :
Hema Drugs Case | పరువు కోసం చచ్చిపోతా.. డ్రగ్స్ కేసులో మీడియాపై మండిపడిన హేమ