Naga Shourya | పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమస్య ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని హోటల్ మరియు రెస్టారెంట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా తగ్గిపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా హోటళ్లలో వంటకాలు ఎక్కువగా గ్యాస్‌పై ఆధారపడుతుంటాయి. అయితే గ్యాస్ సిలిండర్ల సరఫరా తగ్గిపోవడంతో చాలా హోటల్ యజమానులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. కొన్ని చోట్ల ఇండక్షన్ స్టౌలను ఉపయోగిస్తుండగా, మరికొన్ని రెస్టారెంట్లు పాతకాలపు విధానమైన కట్టెల పొయ్యిలను మళ్లీ ఉపయోగించడం ప్రారంభించాయి.
గ్యాస్ కొరత కారణంగా కొంతమంది హోటల్ నిర్వాహకులు తమ మెనూలో కూడా మార్పులు చేస్తున్నారు. ఎక్కువ గ్యాస్ అవసరమయ్యే దోశలు, చపాతీలు వంటి వంటకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉందని ఫుడ్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని హోటళ్లు తాత్కాలికంగా మూతపడే పరిస్థితి కూడా ఏర్పడవచ్చని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో నాగశౌర్య తల్లి, నిర్మాత ఉషా ముల్పూరి నిర్వహిస్తున్న రెస్టారెంట్ కూడా ఈ సమస్యను ఎదుర్కొంటోంది. హైదరాబాద్‌లో ఆమె నడుపుతున్న ‘ఉషా ముల్పూరి కిచెన్’ ఇప్పటికే ఫుడ్ లవర్స్‌కు ప్రముఖ హాట్‌స్పాట్‌గా మారింది. ఇంటి వంటల రుచిని గుర్తు చేసే ఆంధ్రా వంటకాలు, మటన్ కుక్కర్ పులావ్ వంటి ప్రత్యేక వంటకాలతో ఈ రెస్టారెంట్ మంచి గుర్తింపు సంపాదించింది.
అయితే ప్రస్తుతం నగరంలో గ్యాస్ కొరత కారణంగా తమ రెస్టారెంట్లో వంటలను కట్టెల పొయ్యిపై చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఉషా ముల్పూరి ఒక వీడియో ద్వారా వెల్లడించారు. ఉదయం నుంచే తమ సిబ్బంది పొగ మధ్యలో పని చేయాల్సి వస్తోందని ఆమె చెప్పారు. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో మేము కట్టెల పొయ్యిపై వంట చేయాల్సి వస్తోంది. ఉదయం ఆరు గంటల నుంచే మా సిబ్బంది పని మొదలుపెడుతున్నారు. ఒకవైపు ఎండ, మరోవైపు పొగ ఉండటంతో పని చాలా కష్టంగా ఉంది. అయినప్పటికీ మా వద్దకు వచ్చే కస్టమర్లను నిరాశపరచకూడదనే ఉద్దేశంతో వంట ఆపకుండా కొనసాగిస్తున్నాం అని ఆమె తెలిపారు. అలాగే గ్యాస్ కొరత ఉన్నప్పటికీ కొన్ని వంటకాలను ప్రతిరోజూ అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తమ రెస్టారెంట్‌కు వచ్చే అతిథులు ఆకలితో వెనుదిరగకూడదనే ఉద్దేశంతోనే కష్టపడి వంట చేస్తున్నామని పేర్కొన్నారు. కట్టెల పొయ్యిపై వండిన వంటకాలు మరింత రుచిగా ఉంటాయని కూడా ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో గ్యాస్ కొరత కారణంగా రెస్టారెంట్ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ అందక కొన్ని హోటళ్లు మూతపడగా, మరికొన్ని కట్టెల పొయ్యిలపైనే వంటలు కానిస్తున్నాయి. సినీ హీరో నాగశౌర్య తల్లి ఉషా మాల్పూరీ సైతం తన రెస్టారెంట్లో కట్టెల పొయ్యి మీదనే వంటలు చేస్తున్నారు. పొగ వల్ల… pic.twitter.com/2Zi7HyIm3L
— ChotaNews App (@ChotaNewsApp) March 15, 2026