Womens T20 World Cup : మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు వేళైంది. తొమ్మిదో సీజన్లో విజేత ఎవరో మరికాసేపట్లో తేలిపోనుంది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లలో తొలిసారి చాంపియన్‌గా అవతరించేది ఎవరో చూడాలి. గతంలో రెండుసార్లు ఫైనల్ చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకున్న సఫారీ, కివీస్‌లలో ఎవరు టైటిల్ గెలిచినా కొత్త చాంపియన్ పుట్టినట్టే. దాంతో, సమఉజ్జీల సమరంలో ఉత్కంఠ పోరు ఖాయమంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఇక.. గత 8 సీజనల్లో ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో ఆరుసార్లు కప్పు తన్నుకుపోయింది. ఇంగ్లండ్, వెస్టిండీస్‌లు తలా ఓసారి పొట్టి ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడాయి. మరి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఏ ఏడాది రన్నరప్‌గా నిలిచాయో తెలుసా..?
పురుషుల టీ20 వరల్డ్ కప్‌ను 2007లో ప్రవేశపెట్టిన ఐసీసీ రెండేండ్లకు మహిళలకూ మెగా టోర్నీ నిర్వహించింది. 2009లో తొలిసారి జరిగిన ఆ టోర్నీలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ ఫైనల్లో అడుగుపెట్టాయి. అయితే.. టైటిల్ పోరులో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించి తొలిసారి చాంపియన్ అయింది. 2010లో సైతం కివీస్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ ఆస్ట్రేలియా చేతిలో కంగుతిని మరోసారి రన్నరప్‌గా ఇంటిముఖం పట్టింది.
Tell us your prediction for the #T20WorldCup 2024 Final 👀
Preview 👉 https://t.co/T7RSSxrB4o pic.twitter.com/dGJgkmDHDm
— ICC (@ICC) October 20, 2024
ఇక 2012 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్.. తొలి సీజన్ విజేత ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో కంగారూ అమ్మాయిల జట్టు 4 పరుగుల తేడాతో గెలిచి రెండో ట్రోఫీ సొంతం చేసుకుంది. ముచ్చటగా మూడోసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన ఆసీస్ మళ్లీ ఇంగ్లండ్‌నే ఓడించి 2014లో కప్‌ను ఎగరేసుకుపోయింది. పొట్టి వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల ఆధిపత్యానికి చెక్ పెడుతూ 2016లో వెస్టిండీస్ ఫైనల్‌కు వచ్చింది. కప్ వేటలో హ్యాట్రిక్ విజేత ఆసీస్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన కరీబియన్ జట్టు చాంపియన్‌గా అవతరించింది.
అనంతరం 2020లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు తొలిసారి ఫైనల్ చేరింది. కానీ, ఆస్ట్రేలియా ధాటికి 85 పరుగుల తేడాతో పరాజయం పాలై రన్నరప్‌గా టోర్నీని ముగించింది. ఎనిమిదో సీజన్లో దక్షిణాఫ్రికా, ఆసీస్‌లు ఫైనల్లో తలపడ్డాయి. అయితే.. సఫారీల మొదటి ఐసీసీ ట్రోఫీ ఆశలపై నీళ్లు చల్లుతూ మేగ్ లానింగ్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా ఆరోసారి చాంపియన్‌గా నిలిచింది.