RJD : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల (Jharkhand assembly polls) తేదీ దగ్గర పడుతుండటంతో అధికార జేఎంఎం-కాంగ్రెస్ పార్టీల కూటమి సీట్ల పంపకంపై ముమ్మర కసరత్తు చేస్తోంది. జార్ఖండ్‌లోని మొత్తం 81 స్థానాలకుగాను కాంగ్రెస్, జేఎంఎం కలిసి 70 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించడంపై ఆ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆర్జేడీ అసంతృప్తి వ్యక్తంచేసింది. సీట్ల పంపకాల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని స్థానిక ఆర్జేడీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆర్జేడీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు మనోజ్ కుమార్ ఝా మాట్లాడుతూ.. తమకు 12 కంటే తక్కువ సీట్లు ఇస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఒకవేళ తాము ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చినా ఇండియా కూటమి అవకాశాలను దెబ్బతీయబోమని చెప్పారు. 12-13 సీట్ల కంటే తక్కువైతే తమకు ఆమోద యోగ్యం కాదని, మా పార్టీకి 18-20 స్థానాల్లో బలం ఉందని చెప్పారు. కేవలం మూడు నాలుగు స్థానాల్లో పోటీ చేయాలంటే కుదరదని, తాము త్యాగాలకు సిద్ధంగా లేమని అన్నారు.
తమ ఏకైక లక్ష్యం బీజేపీని ఓడించడమేనని చెప్పారు. ఇండియా (I.N.D.I.A) కూటమిని తాము విచ్ఛిన్నం చేయమని, ఒకవేళ ఒంటరిగా పోటీచేయాలని తమ పార్టీ నిర్ణయిస్తే.. 60-62 స్థానాల్లో కూటమి అభ్యర్థులకే మద్దతిస్తామని మనోజ్‌కుమార్ ఝా చెప్పారు. గత ఎన్నికల్లో ఆర్జేడీ ఏడు సీట్లలో పోటీ చేసి కేవలం ఒకే చోట గెలుపొందింది. ఆ పార్టీకి చెందిన సత్యానంద్ భొక్త ప్రస్తుతం హేమంత్ సోరెన్ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతున్నారు. సీట్ల పంపకాలపై మంత్రి మాట్లాడుతూ.. గతంలో తాము గెలిచిన సీట్లే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.