GST | కేంద్రం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నది. ఈ నిర్ణయంతో రాబోయే రోజుల్లో బాటిల్ వాటర్, సైకిల్స్, నోట్‌బుక్స్ రేట్లు తగ్గే అవకాశం ఉన్నది. ఆయా వస్తులపై జీఎస్టీ రేటును తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ మంత్రుల బృందం (GOM) సిఫారసు చేసింది. అదే సమయంలో సౌంధర్య సాధనాలు, లగ్జరీ వాచ్‌లు, బూట్ల ధరలపై జీఎస్టీని పెంచాలని విజ్ఞప్తి చేసింది. జీఓఎం సమావేశానికి హాజరైన సభ్యులు జీఎస్టీ కౌన్సిల్‌కు ఈ సూచనలు చేశారు. వచ్చే నెలలో జరిగే సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. 20 లీటర్లు అంతకంటే ఎక్కువగా ఉండే బాటిల్ వాటర్‌పై జీఎస్టీని 18శాతం నుంచి 5శాతానికి తగ్గించాలని మంత్రుల బృందం కోరింది. అలాగే, రూ.10వేలలోపు ఉన్న సైకిల్స్‌పై జీఎస్టీని 12శాతం నుంచి 5శాతానికి తగ్గించాలని సిఫారు చేసింది.
అలాగే, ప్రాక్టీస్ నోట్బుక్కులపై జీఎస్టీని 5శాతానికి తగ్గించాలని సూచించగా.. ఈ ప్రతిపాదనకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపితే.. ధరలు తగ్గే అవకాశం ఉన్నది. ఇక రూ.15వేలు, అంతకన్నా ఎక్కువ ఖరీదు చేసే బూట్లు, రూ.25వేలకు మించి ఉండే లగ్జరీ వాచ్‌లపై జీఎస్టీ రేటును 18శాతం నుంచి 28శాతానికి పెంచాలని మంత్రుల బృందం సూచించింది. అలాగే, కాస్మోటిక్, హెయిర్ డ్రైయర్స్, హెయిర్ కలర్స్‌పై సైతం జీఎస్టీని పెంచాలని సూచించింది. అయితే, ప్రతి వర్గానికి చెందిన వారికి ఉపశమనం కలిగించేందుకు మంత్రుల బృందం చొరవ తీసుకుంటుందని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో భాగమైన బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్లపై సైతం ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. సిఫారసులపై జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. జీఎస్టీ కౌన్సిల్‌కు నివేదిక సమర్పించే ముందు ప్యానెల్ మరోసారి సమావేశమవుతుందన్నారు.
ప్యానెల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, మేఘాలయ, పంజాబ్, తమిళనాడు, తెలంగాణకు చెందిన మంత్రులు సైతం ఉన్నారు. అక్టోబర్ నెలాఖరులోగా ప్యానెల్ తన నివేదికను జీఎస్టీ కౌన్సిల్‌కు సమర్పించాల్సి ఉంటుంది. జీఎస్టీ కోసం ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల మంత్రుల బృందం (GoM)లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, కేరళ ఆర్థిక మంత్రులు సురేష్ కుమార్ ఖన్నా, గజేంద్ర సింగ్, కృష్ణ బైరే గౌడ, చంద్రిమా భట్టాచార్య, కేఎన్ బాలగోపాల్ ఉన్నారు. ప్రస్తుతం జీఎస్టీలో నాలుగు శ్లాబులు ఉన్నాయి. వీటిలో 5శాతం, 12శాతం, 18శాతం, 28శాతం స్లాబ్స్ ఉన్నాయి. ముఖ్యంగా రోజువారీ, అవసరమైన వినియోగానికి సంబంధించిన వస్తువులు 5శాతం రేటులో ఉంటాయి. లగ్జరీ వస్తువులు అత్యధికంగా 28శాతం రేటు స్లాబ్‌లో చేర్చారు.