Olympic Medal Winners : ఒలింపిక్స్‌లో మువ్వన్నెల జెండాను సగర్వంగా ఎగరవేసిన అథ్లెట్లు యువతరానికి స్ఫూర్తి ప్రధాతలు అవుతున్నారు. అంతేకాదు.. పారిస్ విశ్వ క్రీడ(Paris Olympics)ల్లో పతకాలతో మెరిసిన క్రీడాకారులపై కాసుల వర్షం కురుస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏకంగా కోట్లలోనే నజారానాలు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒలింపిక్ విజేతలు భారీగానే పన్ను(Tax) కడుతారా? అనే సందేహం రావడం సహజమే.
అయితే.. ఒలింపిక్స్ యోధులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నగదు బహుమతులు, ఇతర కానుకలపై పన్ను మినహాయింపు ఉంటుంది. కేంద్రానికి చెందిన ప్రత్యక్ష పన్నుల బోర్డు (Direct Taxes Board) 2014లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. ఒలింపిక్స్ లేదా కామన్వెల్త్ గేమ్స్ వంటి ప్రతిష్ఠాత్మక పోటీల్లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లు దేశ గౌరవాన్ని పెంచుతారు.
అందుకని వాళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకంగా పలు కానుకలు ఇస్తాయి. కాబట్టి.. వాటిపై పన్ను విధించడం సరికాదని భావించి టాక్స్ బోర్డ్ మినహాయింపును ప్రకటించింది. అంతేకాదు ఈ పోటీల్లో వాళ్లు అందుకున్న పతకాల విలువ కూడా మార్కెట్లో చాలా ఎక్కువే ఉంటుంది. అవి ఆటగాళ్ల ప్రతిభ, కష్టానికి గుర్తింపు కాబట్టి వాటిపై కూడా టాక్స్ విధించరు.
ఒకవేళ ప్రైవేట్ సంస్థలు లేదా వ్యక్తులు ఎవరైనా ఒలింపిక్ విజేతలకు కానుకలు ఇస్తే.. వాటిపై మాత్రం టాక్స్ చెల్లించక తప్పదు. అయితే.. విశ్వ క్రీడల్లో పతకం గెలిచిన వాళ్లకు ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు ఇచ్చే బహుమతుల విలువ రూ.50 వేలు దాటాలి. అప్పుడు ‘ఇతర మార్గాల ద్వారా ఆదాయం’ విభాగం కింద ఒలింపిక్ విజేతలు పన్ను కట్టాల్సి ఉంటుంది.
ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలతో చరిత్ర సృష్టించిన మను భాకర్, మిక్స్డ్ టీమ్‌లో కంచు మోత మోగించిన సరబ్జోత్ సింగ్‌లకు యువజన వ్యవహారాల శాఖ భారీ ప్రైజ్‌మనీ ప్రటించింది. మనూ కు రూ. 30 లక్షలు, సరబ్జోత్ సింగ్ రూ.22.5 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇక వరుసగా రెండో కాంస్యం కొల్లగొట్టిన హాకీ హీరోలకు భారత హాకీ ఇండియా తలా రూ.15 లక్షలు ముట్టజెప్పనుంది. హాకీ టీమ్‌లోని పంజాబ్ ఆటగాళ్లకు ఒక్కొక్కరికి కోటి ఇస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.