Srisailam | శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మహాగణపతి పూజ జరిపిన తర్వాత ఈవో డి.పెద్దిరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎందరో దేశభక్తుల త్యాగాల ఫలితంగా లభించిన స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను మనం అనుభవిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్యోద్యమ ఘట్టాలను వివరించారు. గత ఏడాది కాలంలో దేవస్థానం సాధించిన ప్రగతిని తెలియజేశారు.
శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని ఈవో పెద్దిరాజు అన్నారు. భక్తుల రద్దీకి అనుణంగా ఆయా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆయా సౌకర్యాల కల్పనకు తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. క్షేత్రాభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. సిబ్బంది కూడా క్షేత్రాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. కాగా, ఈ వేడుకల్లో భాగంగా నందికట్కూరుకు చెందిన సాయిలిక్షిత, లిక్షితా శ్రీ నృత్య కళాశాల వారు దేశభక్తి గీతాలకు సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు.