WTC Final : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final)కు మరో నాలుగు రోజులే ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా(Australia) మరోసారి టెస్టు గదపై కన్నేయగా.. ‘ఐసీసీ ఛాంపియన్’ అనిపించుకోవాలని దక్షిణాఫ్రికా కంకణం కట్టుకుంది.
కాబట్టి.. ఇరుజట్ల మధ్య జూన్ 11న డబ్ల్యూటీసీ ఫైనల్ హోరాహోరీగా జరగడం ఖాయం అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ (AB deVilliers) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి సఫారీల చేతిలో ఆసీస్‌కు భంగపాటు తప్పదని అతడు పేర్కొన్నాడు.
లార్డ్స్ మైదానంలో జూన్ 11న డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది. ఐసీసీ టైటిల్ కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న దక్షిణాఫ్రికాకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ‘యావత్ దేశమంతా మా జట్టుకు మద్దతుగా ఉంది. ఐసీసీ ఫైనల్స్‌లో ఓడిపోతుండడంతో చోకర్స్‌గా తమపై పడిన ముద్రను చెరిపివేసుకునే సమయం వచ్చేసింది. ఇరుజట్ల మధ్య ఫైనల్ పోరు కోసం నేను ఆతృతగా ఉన్నాను. అన్నివిభాగాల్లో మా జట్టు సమతూకంగా ఉంది. చెప్పాలంటే ఆసీస్‌కు సమఉజ్జీలా. నాకు ఎందుకనో.. ఈసారి మా చేతిలో ఆస్ట్రేలియాకు భంగపాటు తప్పదని అనిపిస్తోంది.
ఎందుకిలా చెబుతున్నానంటే డబ్ల్యూటీసీ ఫైనల్లో అస్ట్రేలియా కచ్చితంగా ఫేవరెట్ జట్టు. అందులోని చాలామంది ఆటగాళ్లకు మెగా టోర్నీ ఫైనల్స్ ఆడిన అనుభవం ఉంది. పైగా వాళ్ల కూర్పు కూడా బాగుంది. సో.. కంగారూలను ఓడించి టెస్టు గదను ముద్దాడడం సఫారీలకు అంత సులువేమీ కాదు. కానీ, విశ్వ వేదికపై మా సత్తా చాటాల్సిన సమయం వచ్చేసింది. జట్టులోని క్రికెటర్లంతా సమిష్టిగా ఆడితే మా ఐసీసీ ట్రోఫీ కల సాకారమైనట్టే’ అని డివిలియర్స్ వెల్లడించాడు.