MS Dhoni : ఐపీఎల్ 18వ సీజన్ ముగియడంతో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) చిల్ అవుతున్నాడు. చివరి లీగ్ మ్యాచ్ అనంతరం చెప్పినట్టుగానే మహీ భాయ్ బైక్ మీద రయ్‌మంటూ దూసుకెళుతున్నాడు. వచ్చే సీజన్ గురించి తర్వాత.. ఇప్పుడైతే బండి నడపడంలోనే మజా ఉంది అన్నట్టుగా తనకెంతో ఇష్టమైన బైక్ రైడింగ్‌ను ఆస్వాదిస్తున్నాడీ మాజీ సారథి.
శనివారం ధోనీ నీలం రంగు ‘కవాసకీ'(Kawasaki) బండి నడుపుతున్న ఫొటోను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఎక్స్‌లో పెట్టింది. ఆ ఫొటోలో ఈ మాజీ కెప్టెన్ బూడిద రంగు టీ షర్ట్, నలుపు రంగు ట్రాక్ ప్యాంట్.. స్పోర్ట్స్ షూ ధరించాడు. తలకు హెల్మెట్, వీపున బ్యాక్‌ప్యాక్ తగిలించుకొని జాలీగా బైక్ నడుపుతున్నాడు. ఆ ఫొటో చూసిన ఫ్యాన్స్.. ‘తాల నువ్వు సూపర్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ధోనీకి బైక్‌లంటే ఎంతో మోజు. భారత జట్టుకు ఎంపికైన కొత్తలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌కు బహుమతిగా ఇచ్చిన బండిని మైదానంలో నడుపుతూ మురిసిపోయేవాడు మహీ. వింటేజ్ బైక్‌లపై మనసు పారేసుకునే ధోనీకి వాటిని సేకరించడం.. నడపడం అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ అతడి గ్యారేజ్‌లో వింటేజ్ క్లాసిక్, హై పవర్డ్ సూపర్ బైక్స్ ఉన్నాయి. యమహ ఆర్డీ 350 నుంచి హార్లీ డేవిడ్సన్, కాన్ఫెడరేట్ ఎక్స్ 132 హెల్కాట్స్ నుంచి డుకాటిస్ (Dukatis) వంటి స్పెషల్ బండ్లు ధోనీ కలెక్షన్లో ప్రత్యేకం అని చెప్పాలి.
ఐపీఎల్‌లోనూ దిగ్గజ ఆటగాడిగా పేరొందిన మహేంద్ర సింగ్ ధోనీ లేటు వయసులోనూ బ్యాటుతో, వికెట్ కీపింగ్ నైపుణ్యంతో మెప్పిస్తున్నాడు. తాలా’కు ప్రస్తుతం 43 ఏళ్లు. అతడు మరో సీజన్ ఆడడం బహుశా కష్టమే. ‘ఐపీఎల్ ఆరంభం నుంచి మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానులను మర్చిపోలేను. ప్రస్తుతం నాకు 43 ఏళ్లు. సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడుతున్నాను. అయితే.. నేను ఎప్పుడు ఆటకు వీడ్కోలు పలుకుతాను అనేది చాలామంది ఊహించలేరు. ఇప్పటికే నా శరీరంపై భారం పడుతోంది.
అందుకే.. ఐపీఎల్ 18వ సీజన్ ముగియగానే 6 నుంచి 8 నెలల పాటు నా శరీరంపై దృష్టి సారిస్తాను. ఒత్తిడిని ఎంత వరకూ తట్టుకుంటుంది? అనే విషయమై అంచనాకు వస్తాను. కాబట్టి.. మరో సీజన్ ఆడడంపై ఇప్పుడే స్పష్టమైన నిర్ణయం వెల్లడించలేను’ అని ధోనీ వెల్లడించాడు. పద్దెనిమిదో ఎడిషన్‌లో ఫినిషర్‌గా అలరించిన మహీ.. మొత్తంగా 12 మ్యాచుల్లో 180 రన్స్ కొట్టాడు.