చిట్యాల : ఉస్మానియా అసిస్టెంట్ ప్రొఫెసర్, కవి, రచయిత, డాక్టర్ గిన్నారపు ఆదినారాయణకు కోల్కతాలోని భారతీయ భాషా పరిషత్ ఇటీవల ‘భారతీయ భాషా సమ్మాన్ యువ పురస్కారం – 2025’తో సత్కరించింది. ఈ క్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జన్నె యుగేందర్ ఆధ్వర్యంలో ఆదినారాయణను శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా సన్మానించారు.
తెలుగు భాషా పరిశోధన, సృజనాత్మక సాహిత్య రంగంలో కృషి చేసినందుకుగాను ఈ పురస్కారంతో పాటు, ప్రశంసాపత్రం అందజేసినట్లు తెలిపారు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన గిన్నారపు అత్యంత నిరుపేద కుటుంబం నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ తెలుగు చదివారు. హైదరాబాద్ దళిత ఆత్మ కథలపై డాక్టరేట్ కూడా చేశారు. కొలకలూరి ఇనాక్ రాసిన ఆది ఆంధ్రుడు కావ్యంపై ఎంఫిల్ చదివారు. నానీల సుగుంధం పేరుతో ఒక కవితా సంపుటిని ప్రచురించారు.
యుజీసీ కేర్ లిస్టెడ్ పరిశోధన పత్రికల్లోనూ, దిన వార మాసపత్రికల్లోనూ డాక్టర్ ఆదినారాయణ అనేక వ్యాసాలు, కవితలు రాశారు. ఈ పురస్కారం రావడంపట్ల అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య, జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్, అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గోల్కొండ సురేష్, ధర్మసమాజ్ పార్టీ జిల్లా నాయకులు పుల్ల అశోక్, అఖిల భారత విద్యార్థి పరిషత్ హాస్టల్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లా బార్ కౌన్సిల్ సభ్యులు గాదె భిక్షపతి, ప్రముఖ వర్తమాన గేయ రచయిత దాసారపు నరేష్, అంబేద్కర్ యువజన సంఘం చిట్యాల మండల నాయకులు, కనకం తిరుపతి, దూడపాక సరోత్తం, భువనగిరి తిరుపతి, గురుకుంట్ల కిరణ్, మాస్ రమేష్, గుర్రం తిరుపతి, దూడపాక రమేష్, ఏకు కిషన్, కట్కూరి రాజేందర్, కండే రమేష్ ఆదినారాయణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.