David Warner : పొట్టి ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) ఫామ్ చాటుకున్నాడు. టీ20 ఫార్మాట్లో తనకు తిరుగులేదని నిరూపిస్తూ అర్ధ శతకంతో చెలరేగాడు. పసికూన ఒమన్ (Oman)పై 51బంతుల్లో 56 రన్స్ కొట్టిన ఆసీస్ ఓపెనర్ నెట్టింట వైరల్ అవుతున్నాడు. కంగారు జట్టుకు భారీ స్కోర్ అందించిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. ఖలీముల్లా వేసిన 19వ ఓవర్ ఆఖరి బంతికి ఔటయ్యాడు. వికెట్ పారేసుకున్న కోపంలో వార్నర్ వడివడిగా పెవిలియన్ వెళ్లాడు.
అయితే.. పొరపాటున ఒమన్ జట్టు డ్రెస్సింగ్ రూమ్ మెట్లు ఎక్కడం మొదలెట్టాడు. అతడిని గమనించిన కొందరు ‘ఏం వార్నర్.. ఎటు పోతున్నవ్?.. నువ్వు వెళ్లాల్సింది ఇటు’ అని సూచించడంతో వార్నర్ వెనక్కితిరిగి ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్ వైపు అడుగులు వేశాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో గురువారం పసికూనతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఒకదశలో 50 పరుగులకే మూడు వికెట్లు పడగా.. వార్నర్, మార్కస్ స్టోయినిస్(67 నాటౌట్)లు పట్టుదలగా ఆడారు. ఒమన్ బౌలర్లను ఉతికేస్తూ జట్టు స్కోర్‌ను పరుగులు పెట్టించారు. నాలుగో వికెట్‌కు 102 రన్స్ జోడించిన వీళ్లిద్దరూ హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. అనంతరం 165 పరుగుల ఛేదనలో స్టోయినిస్ మూడు వికెట్లతో ఒమన్ నడ్డి విరిచాడు. దాంతో, ఆసీస్ 39 పరుగుల తేడాతో గెలుపొందింది.