Chris Gayle : ఇంగ్లండ్ సిరీస్‌లో దంచికొడుతున్న భారత యువ ఓపెన్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal)పై వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్(Chris Gayle) ప్రశంసలు కురిపించాడు. టీ20 తరహాలో రెచ్చిపోతున్న యశస్వీని చూస్తూంటే 20 ఏండ్ల అనుభవం ఉన్న ఆటగాడిలా కనిపిస్తున్నాడని గేల్ అన్నాడు. ‘యశస్వీ ఆటను గమనిస్తే ఎంతో అనుభవజ్ఞుడిలా తోస్తున్నాడు. కెరీర్ ఆరంభంలోనే అతడు ఇలా ఆడడం నాకు నమ్మకశ్యంగా అనిపించడం లేదు.
యశస్వీ అటాకింగ్ గేమ్‌ను చూస్తుంటే.. నాకు మా జట్టు మాజీ సహచరుడు శివ్‌నారాయణ్ చందర్‌పాల్ (Shivnarine Chanderpaul) గుర్తుకు వస్తున్నాడ’ని యూనివర్సల్ బాస్ తెలిపాడు. అంతేకాదు ఇంగ్లండ్‌ను చూసి యశస్వీ బజ్ బాల్ తరహాలో ఆడుతున్నాడనే వార్తల్ని ఈ మాజీ ఓపెనర్ కొట్టి పారేశాడు. ‘యశస్వీ దూకుడుగా ఆడడం ఇంగ్లండ్‌ను చూసి నేర్చుకోలేదని,. కోచ్ జ్వాలా సింగ్ శిక్షణలోనే అతడు అటాకింగ్ గేమ్ ఆడడం అలవర్చుకున్నాడ’ని గేల్ వెల్లడించాడు.
యశస్వీ జైస్వాల్
నిరుడు వెస్టిండీస్ పర్యటనతో టెస్టుల్లో అరంగేట్రం చేసిన యశస్వీ.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు. అనంతరం టీ20 ఫార్మాట్లో శుభారంభాలు ఇస్తూ.. ఓపెనర్‌గా స్థిరపడిపోయాడు. దాంతో, ఇంగ్లండ్ పర్యటనలో ఈ యంగ్‌స్టర్ ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. తొలి టెస్టులో ఫర్వాలేదనిపించినా..రెండో టెస్టులో డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. అదే జోరును రాజ్‌కోట్ టెస్టులోనూ కొనసాగించిన ఈ లెఫ్ట్ హ్యాండర్ రెండో డుబల్ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకూ ఈ కుర్ర ఓపెనర్ మూడు టెస్టుల్లో యశస్వీ 109 సగటుతో 545 పరుగులు సాధించాడు.