e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, April 17, 2021
Advertisement
Home స్పోర్ట్స్ లార్డ్స్‌ లక్ష్యంగా..

లార్డ్స్‌ లక్ష్యంగా..

లార్డ్స్‌ లక్ష్యంగా..


నేటి నుంచి భారత్‌, ఇంగ్లండ్‌ నాలుగో టెస్టు.. డ్రా చేసుకున్నా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమ్‌ఇండియా
ఉదయం 9.30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..
విరాట్‌ కోహ్లీ మరో 17 పరుగులు చేస్తే కెప్టెన్‌గా 12వేల అంతర్జాతీయ పరుగుల మార్క్‌ను చేరుకుంటాడు. పాంటింగ్‌ (15,440), గ్రేమ్‌ స్మిత్‌ (14,878) మాత్రమే ఇది వరకు ఈ ఘనత సాధించారు. అలాగే విరాట్‌ (41) మరో సెంచరీ చేస్తే కెప్టెన్‌గా అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్‌గానూ పాంటింగ్‌ను దాటి చరిత్ర సృష్టిస్తాడు.

మరో నాలుగు వికెట్లు తీస్తే భారత గడ్డపై వంద టెస్టు వికెట్లు దక్కించుకున్న ఐదో టీమ్‌ఇండియా పేసర్‌గా ఉమేశ్‌ యాదవ్‌ రికార్డు సృష్టిస్తాడు.
స్పిన్‌ మాయలో ఇంగ్లండ్‌ను పడేసేందుకు కోహ్లీసేన పక్కా ప్రణాళికతో సిద్ధమైంది. నాలుగో టెస్టులో పర్యాటక జట్టును ఓడించి లార్డ్స్‌ వేదికగా జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలని పట్టుదలగా ఉంది. స్పిన్నర్లు అశ్విన్‌, అక్షర్‌ పదునైన బంతులతో మొతెరా పిచ్‌పై సత్తాచాటేందుకు సిద్ధంగా ఉండగా.. బ్యాటింగ్‌ లోపాలపై భారత్‌ దృష్టిసారించింది. మరోవైపు ఈ మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ సమం చేయాలని ఇంగ్లండ్‌ కసితో ఉంది.
అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌ను స్పిన్‌ ఉచ్చులో ఉక్కిరిబిక్కిరి చేసేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. గురువారం నుంచి ఇక్కడి మొతెరా మైదానంలో జరుగనున్న నాలుగో టెస్టులో ఇంగ్లిష్‌ జట్టును మట్టికరిపించి 3-1 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని కోహ్లీసేన తహతహలాడుతున్నది. లార్డ్స్‌ వేదికగా జూన్‌లో జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌(డబ్ల్యూటీసీ)కు అర్హత సాధించాలంటే భారత్‌ ఈ మ్యాచ్‌ను కనీసం డ్రా చేసుకున్నా సరిపోతుంది. అయితే మూడో టెస్టులో తిప్పేసినట్టుగానే ఆఖరు మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌ను మట్టికరిపించాలని టీమ్‌ఇండియా పట్టుదలగా ఉంది. డే అండ్‌ నైట్‌గా గులాబీ బంతితో జరిగిన మూడో టెస్టు అనూహ్యంగా రెండు రోజుల్లో 842 బాల్స్‌లోనే ముగియడంతో స్పిన్‌ పిచ్‌ అంటూ రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే పచ్చికతో నింపిన విదేశీ పిచ్‌లపై తామెప్పుడూ వ్యాఖ్యలు చేయలేదని, స్పిన్‌ పిచ్‌పై ఎందుకీ గోల అంటూ కొందరు భారత ఆటగాళ్లు దీటుగా బదులిస్తున్నారు. మరోవైపు చివరి టెస్టుకు కూడా గత మ్యాచ్‌ లాంటి పిచ్‌ ఉంటుందని భారత ఉపసారథి రహానే ఇప్పటికే పేర్కొన్నాడు. ఈ తరుణంలో ఇంగ్లండ్‌కు మరో స్పిన్‌ రైడ్‌ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మూడో టెస్టు గులాబీ బంతితో జరుగగా.. ఈ మ్యాచ్‌ ఎర్ర బంతితో కావడంతో పరిస్థితిలో కాస్త మార్పు ఉండొచ్చు.
జట్టులోకి ఉమేశ్‌!
వ్యక్తిగత కారణాల వల్ల నాలుగో టెస్టు నుంచి భారత స్పీడ్‌స్టర్‌ జస్ప్రీత్‌ బుమ్రా తప్పుకోవడంతో సీనియర్‌ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మరో పేసర్‌ స్థానానికి ఇషాంత్‌ శర్మనే కొనసాగించే చాన్స్‌ ఉండగా.. హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌కు అవకాశం తక్కువే.
బెస్‌ రాక
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో 17 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేసిన స్పిన్నర్‌ డామ్‌ బెస్‌ను ఇంగ్లండ్‌ నాలుగో టెస్టులో బరిలోకి దింపనుండడంతో ఓ పేసర్‌ను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బ్రాడ్‌ను తప్పించే అవకాశముంది.
బ్యాటింగ్‌ గాడిలో పడాల్సిందే..
ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భారత స్పిన్నర్లు అశ్విన్‌, అక్షర్‌ దుమ్మురేపారు. మూడో టెస్టులో 11 వికెట్లతో అక్షర్‌ అదరగొడితే.. అశ్విన్‌ కూడా వైవిధ్యమైన బంతులతో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ సిరీస్‌లో ఈ ఇద్దరూ కలిసి 42 వికెట్లు పడగొట్టారు. పేసర్లకు పెద్దగా పని పడలేదు. అయితే బ్యాటింగ్‌ విభాగంలో టీమ్‌ఇండియాలో కాస్త ఆందోళన నెలకొంది. మూడు టెస్టు ల్లో రోహిత్‌ శర్మ రెండు అర్ధశతకాలతో 296 పరుగులతో ఆకట్టుకోగా.. ఆ తర్వా త అశ్విన్‌ (176) ఉన్నాడు. రహానే, పుజార, గిల్‌ ఆశించిన స్థాయిలో రాణించలేదు. కోహ్లీ అర్ధశతకాలు చేసినా ఇప్పటి వరకు భారీ ఇన్నింగ్స్‌ ఆడలేకపోయాడు. కీలకమైన ఈ టెస్టులో బ్యాట్స్‌మెన్‌ గాడిలో పడాలని భారత్‌ ఆశిస్తున్నది.
పిచ్‌, వాతావారణం
మూడో టెస్టులాగే మొతెరా పిచ్‌ స్పిన్‌కు ఎక్కువగా అనుకూలించనుంది. పిచ్‌ పొడిగానే ఉండనుంది. వర్షం పడే అవకాశాలు లేవు.
జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, పుజార, కోహ్లీ (కెప్టెన్‌), రహానే, పంత్‌, అశ్విన్‌, సుందర్‌, అక్షర్‌, ఇషాంత్‌, ఉమేశ్‌ యాదవ్‌
ఇంగ్లండ్‌: క్రాలీ, సిబ్లే, బెయిర్‌స్టో, రూట్‌ (కెప్టెన్‌), స్టోక్స్‌, పోప్‌, ఫోక్స్‌, బెస్‌, ఆర్చర్‌, లీచ్‌, బ్రాడ్‌ / అండర్సన్‌

Advertisement
లార్డ్స్‌ లక్ష్యంగా..

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement