IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత జట్టు పట్టుబిగించే దిశగా సాగుతోంది. తొలి సెషన్లో నిప్పులు చెరిగిన జస్ప్రీత్ బుమ్రా(4-63) ఇంగ్లండ్ మిడిలార్డర్‌ను చకచకా చుట్టేశాడు. రెండో కొత్త బంతితో బెన్ స్టోక్స్(44), జో రూట్(114) లను బౌల్డ్ చేసి ఆతిథ్య జట్టు నడ్డివిరిచాడు. అయితే.. రెండో టెస్టులో మాదిరిగానే టెయిలెండర్లు ఈసారీ ప్రతిఘటిస్తున్నారు. ఆలౌట్ అంచున నిలిచిన ఇంగ్లండ్‌ను వికెట్ కీపర్ జేమీ స్మిత్ (51 నాటౌట్) మరోసారి ఆదుకున్నాడు.
స్టోక్స్, రూట్, వోక్స్ ఔటయ్యాక జట్టును గట్టెక్కించే బాధ్యతను భుజాన వేసుకున్న స్మిత్ ఒత్తిడిలోనూ ఖతర్నా్క్ బ్యాటింగ్ చేశాడు.
పేసర్ బ్రాండన్ కార్సే(33 నాటౌట్)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు విలువైన 82 రన్స్ రాబట్టాడు. దాంతో, ఆతిథ్య జట్టు లంచ్ బ్రేక్ సమయానికి 7 వికెట్లు కోల్పోయి 353 పరుగులు చేసింది.
అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీ మూడో టెస్టులో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా(4-63) ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు తోకముడిచారు. ఈ స్పీడ్‌స్టర్ విజృంభణతో.. ఓవర్ నైట్ స్కోర్ 251/4తో తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ చూస్తుండగానే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది. తొలి సెషన్లో కొత్త బంతితో ప్రమాదకరంగా కనిపించిన బుమ్రా.. ఆతిథ్య జట్టు మిడిలార్డర్‌ను కకావికలం చేశాడు. బెన్ స్టోక్స్‌ను సూపర్ బంతితో బౌల్డ్ చేసిన ఈ యార్కర్ కింగ్.. సెంచరీతో ఇంగ్లండ్‌ను ఆదుకున్న జో రూట్‌ను క్లీన్ బౌల్డ్ చేసి భారత శిబిరంలో సంబురం నింపాడు.
Lunch on Day 2 at Lord’s 🏟️
Three wickets in the the morning session for @Jaspritbumrah93 & #TeamIndia 👌👌
England 353/7 in the 1st innings
Scorecard ▶️ https://t.co/X4xIDiSmBg#ENGvIND pic.twitter.com/rV99ekagyZ
— BCCI (@BCCI) July 11, 2025
ఆ తర్వాత వచ్చిన క్రిస్ వోక్స్(0)ను డకౌట్‌గా వెనక్కి పంపి స్టోక్స్ సేన భారీ స్కోర్ ఆశలపై నీళ్లు చల్లాడు బుమ్రా. కానీ, అంపైర్లు ఏడు ఓవర్లకే బంతిని మార్చడంతో ఇంగ్లండ్ బతికిపోయింది. పాత బంతిని సమర్ధంగా ఆడుతూ జేమీ స్మిత్(51 నాటౌట్), బ్రాండన్ కార్సే(31 నాటౌట్)లు కీలక భాగస్వామ్యం నెలకొల్పి స్కోర్ 350 దాటించారు. రెండో సెషన్లో ఈ జోడీ త్వరగా విడదీస్తేనే గిల్ సేన మ్యాచ్‌పై పట్టుబిగించే అవకాశాలు మెరుగుపడతాయి.