Oh Bhama Ayyo Rama Review | డిఫరెంట్ జానర్ సినిమాలతో దూసుకుపోతున్న యువ నటుడు సుహాస్ కథానాయకుడిగా తెరకెక్కిన తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. ఈ సినిమాకు రామ్ గోధల దర్శకత్వం వహించగా.. వీ ఆర్ట్స్ బ్యానర్‌పై హరీష్ నల్ల నిర్మించారు. మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ సినిమాలో కథానాయికగా నటించింది. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దుసుకుపోతుంది. అయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది ఒకసారి రివ్యూలో చూద్దాం.
కథ
రామ్ (సుహాస్) తల్లి (అనిత) ఒక డ్యాన్సర్. భర్త చేసిన మోసం తట్టుకోలేక రామ్ చిన్నతనంలోనే అతడిని తీసుకుని బయటకు వస్తుంది. అయితే కొన్ని రోజులకే ఆమె చనిపోవడంతో రామ్‌ను చేరదీసి పెంచి పెద్ద చేస్తాడు అతని మేనమామ (అలీ). అయితే రామ్‌కి చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఒకరకమైన చిరాకు ఏర్పడుతుంది. ఎలాగైన విదేశాల్లో చదువుకోవాలని కలలు కంటాడు. ఒకరోజు తన తల్లి జయంతి సందర్భంగా వరంగల్ వెళ్లి తిరిగి వస్తున్న రామ్ తాగి కారు నడుపుతూ ప్రమాదానికి గురైన సత్యభామ (మాళవిక మనోజ్) అనే అమ్మాయిని రక్షిస్తాడు. దీంతో సత్యభామ రామ్ వ్యక్తిత్వం నచ్చి అతడిపై ఇష్టం పెంచుకుంటుంది. అయితే సత్య జీవితంలోకి వచ్చాక రామ్ లైఫ్‌లో జరిగిన సంఘటనలు ఏంటి.? రామ్ గతం ఏమిటి? రామ్‌ని సత్య దర్శకుడు హరీష్ శంకర్ వద్ద అసిస్టెంట్‌గా ఎందుకు చేరుస్తుంది.? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
తన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి కలర్ ఫోటో, రైటర్ పద్మ భూషణ్, జనక అయితే గనక లాంటి మంచి కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు సుహాస్. తన నటనతో ప్రశంసలు పొందుతూ, డీసెంట్ హిట్లతో దూసుకుపోతున్నారు. కాన్సెప్ట్ చిత్రాలే ఆయనకు బలం అని చెప్పొచ్చు. అయితే, ఇటీవల ఆయన కమర్షియల్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నట్లు అనిపిస్తుంది. అయితే కమర్షియల్ సినిమాలలో దమ్ములేని కథలు ఎంచుకోవడం వల్ల అవి ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు.
తాజాగా విడుదలైన “ఓ భామ అయ్యో రామ” కూడా కమర్షియల్ చిత్రమే అయినప్పటికీ, మదర్ సెంటిమెంట్‌ను జోడించి భావోద్వేగంగా నడిపించడంలో మేకర్స్ విజయం సాధించారు. సినిమా మొదటి భాగం రొటీన్‌గా, ఆకట్టుకునేలా లేదు. హీరోహీరోయిన్ల పరిచయం, లవ్ ట్రాక్ సాధారణంగా సాగాయి. అయితే, ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ సినిమాను మలుపు తిప్పుతుంది. అక్కడి నుంచి కథ సీరియస్‌గా సాగుతుంది. అలీ పాత్ర ద్వారా వచ్చే సెంటిమెంటల్ సన్నివేశాలు, ముఖ్యంగా హీరో తల్లి మరణం, అలీ అతన్ని పెంచడం వంటివి హృదయాన్ని హత్తుకుంటాయి. రెండో భాగం మెరుగ్గా ఉంటుంది. లవ్ ట్రాక్‌లో సీరియస్‌నెస్, ఫ్రెండ్ పెళ్లిలో కామెడీ ఆకట్టుకుంటాయి. సుహాస్ తల్లి ఎపిసోడ్, తండ్రితో అతని గతం, చిన్ననాటి కష్టాలు చాలా ఎమోషనల్‌గా ఉన్నాయి. హీరోయిన్ హీరోను వదిలేయడం రొటీన్‌గా ఉన్నా, చివరి ట్విస్ట్ సస్పెన్స్‌ను పెంచుతుంది. క్లైమాక్స్ లో తప్పుదోవ పట్టించి అసలు విషయాన్ని బయటపెట్టే తీరు, రొటీన్‌కు భిన్నంగా ఉండటం బాగుంది, కానీ లాజిక్కు దూరంగా అనిపిస్తుంది.
నటినటులు
సుహాస్ రామ్ పాత్రలో తన నటనతో ఆకట్టుకున్నాడు, ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో అదరగొట్టాడు. మాళవిక మనోజ్ సత్యభామగా సుహాస్‌ను డామినేట్ చేసే స్థాయిలో అద్భుతంగా నటించింది. చాలా కాలం తర్వాత తెరపై కనిపించిన అనిత, సుహాస్ తల్లిగా ఎమోషనల్ సీన్లతో కన్నీళ్లు పెట్టించి ఆకట్టుకుంది. రవీంద్ర విజయ్ తండ్రి పాత్రలో ఓకే అనిపించగా, బబ్లూ పృథ్వీరాజ్ హీరోయిన్ తండ్రిగా తన నటనతో మెప్పించాడు. అలీ మామయ్య పాత్రలో నవ్వించడమే కాకుండా, భావోద్వేగాలను కూడా పండించాడు. సుహాస్ స్నేహితులు సాత్విక్ నవ్వించారు, నయని పావని కూడా మంచి పాత్రను దక్కించుకుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల్లో ఓకే అనిపించారు. దర్శకులు హరీష్ శంకర్ మరియు మారుతి అతిథి పాత్రల్లో మెరిసి ఆశ్చర్యపరిచారు.
సాంకేతికంగా
ఈ చిత్రం సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. మణికందన్ సినిమాటోగ్రఫీ దృశ్యాలను రంగులమయంగా, ఆకర్షణీయంగా చూపించి సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బ్రహ్మకడలి ఆర్ట్ వర్క్ ప్రత్యేకంగా ఉంది. రథన్ సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు, పాటలు మరియు నేపథ్య సంగీతం రెండూ బాగున్నాయి. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి, కథకు మించి ఖర్చు చేశారు. దర్శకుడు రామ్ గోధల కథ పర్వాలేదు కానీ రొటీన్‌గా ఉంది. టేకింగ్‌లో, ముఖ్యంగా మొదటి భాగంలో, ఆయన మరింత శ్రద్ధ వహించాల్సింది. కథలో ఉండాల్సిన భావోద్వేగాలు, సోల్ సరిగా పండలేదని చెప్పొచ్చు. మొత్తం మీద సినిమా పర్వాలేదనిపిస్తుంది.
చివరిగా తల్లి సెంటిమెంట్, భావోద్వేగాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. కుటుంబంతో కలిసి చూడదగిన ఒక మంచి సినిమా.
రేటింగ్ : 2.5/5