Cricket Australia : ఆరోసారి విశ్వ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టును గాయాలు వేధిస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరు గాయాలతో టీమ్‌కు దూరం అవుతున్నారు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ మధ్యలోనే పేసర్లు రిలే మెరిడిత్, నాథన్ ఎల్లిస్, గ్జివియర్ బార్ట్లెట్లు జట్టును వీడగా.. వన్డేల్లో అరంగేట్రం చేసిన స్పీడ్‌స్టర్ బెన్ ద్వారుషిస్ ఒక్క మ్యాచ్‌కే పరిమితం అయ్యాడు.
అసలే బౌలర్ల కొరతతో అల్లాడుతున్న కంగారూ జట్టుకు మరో షాక్. యువ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్(Cameron Green) సైతం గాయపడ్డాడు. వీపు భాగంలో గాయం కారణంగా అతడు చివరి రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఇంగ్లండ్‌తో మిగతా వన్డేలకు గ్రీన్ దూరం అవుతున్నాడనే విషయాన్ని శుక్రవారం క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia) వెల్లడించింది. అయితే.. భారత జట్టుతో నవంబర్‌లో జరిగే బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలోపు గ్రీన్ ఫిట్నెస్ సాధిస్తాడా? లేదా? అని కంగారూ జట్టు ఆందోళనతో ఉంది.
JUST IN: Cameron Green faces a race to be fit for the Border-Gavaskar Trophy after suffering a back injury on Australia’s tour of England 🤕 pic.twitter.com/F3bXcMGMRf
— ESPNcricinfo (@ESPNcricinfo) September 27, 2024
ఇంగ్లండ్‌తో మూడో వన్డే సమయంలో గ్రీన్ వెన్న నొప్పి ఉందని సహచరులకు చెప్పాడు. ఓ వైపు నొప్పిని భరిస్తూనే అతడు ఆ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీయడంతో పాటు 45 పరుగులతో రాణించాడు. మ్యాచ్ అనంతరం స్కానింగ్ పరీక్షలు చేయగా గ్రీన్‌కు గాయం అయినట్టు తేలింది. దాంతో, గ్రీన్ కొన్ని రోజుటు ఆటకు విరామం ప్రకటించి.. చికిత్స కోసం స్వదేశానికి బయల్దేరనున్నాడు.