Maggie Smith | హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అకాడమీ అవార్డు విజేత, హ్యారీ పోటర్(Harry Potter) సినిమా ఫేం ప్రముఖ బ్రిటిష్ నటి మ్యాగీ స్మిత్ (Maggie Smith) కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 89. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం ఉదయం లండన్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు స్మిత్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక మ్యాగీ స్మిత్ మరణ వార్త తెలుసుకున్న అభిమానులు, పలువురు సినీ సెలబ్రిటీలు నటి మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు సంపాదించుకున్న మ్యాగీ స్మిత్ హ్యారీ పోటర్ ఫ్రాంచైజ్‌లో ప్రొఫెసర్ మినర్వా మెక్గోనాగల్గా నటించి అలరించింది. ఇదే కాకుండా.. డౌన్టన్ అబ్బే(Downton Abbey) టీవీ సిరీస్‌కు గాను మూడు ఎమ్మీ అవార్డులను గెలుచుకుంది. అలాగే ది ప్రైమ్ ఆఫ్ మిస్ జీన్ బ్రాడీ (The Prime of Miss Jean Brodie) సినిమాలో స్మిత్ నటనకు గాను 1970లో ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.