Neeraj Chopra : పారిస్ ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన నీరజ్ చోప్రా(Neeraj Chopra) ఎట్టకేలకు స్వదేశం వచ్చాడు. విశ్వ క్రీడల్లో వరుసగా రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన బడిసె వీరుడు రెండు నెలల తర్వాత స్వరాష్ట్రం చేరుకున్నాడు. పారిస్‌లో భారత జెండాను రెపరెపలాడించిన నీరజ్‌కు సొంతగడ్డపై అపూర్వ స్వాగతం లభించింది. వస్తూ వస్తూనే నీరజ్ యువతరంతో ముచ్చటించేందుకు హర్యానాలోని స్పోర్ట్స్ యూనివర్సిటీకి అతిథిగా వెళ్లాడు.
ఇంకేముంది. ఒలింపిక్ యోధువీరుడిపై పూల వర్షం కురిపించారు అక్కడివాళ్లు. అంతేకాదు.. డోలుబాజా, సన్నాయి వాయిద్యాలతో నీరజ్‌ను ఘనంగా ఆహ్వానించారు. గుర్రపు స్వారీ చేస్తూ కొందరు ముందు వెళ్లగా.. ఆ వెనకాలే బ్యాండు మేళం వాయిస్తూ కొందరు నడిచారు. వాళ్ల వెనకాల నీరజ్ వస్తూ ఉండగా గులాబీ పూల రెమ్మల్ని చల్లుతూ వీరుడా నీకు స్వాగతం అంటూ ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. విశ్వ క్రీడల విజతేతకు దక్కిన అబ్బురపరిచే స్వాగతానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
#WATCH | Haryana: Ace javelin thrower Neeraj Chopra was welcomed at the Sports University of Haryana in Sonipat’s Rai pic.twitter.com/m0jsR5owFQ
— ANI (@ANI) September 27, 2024
పారిస్ ఒలింపిక్స్ ముందు గజ్జల్లోని కండరాల సమస్య(స్పోర్ట్స్ హెర్నియాలో ఒక రకం)తో చోప్రా బాధ పడ్డాడు. దాంతో, అతడి సన్నద్ధత కూడా సరిగ్గా జరగలేదు. అయినా సరే.. చోప్రా విశ్వ క్రీడల్ల అదరగొట్టాడు. ఫైనల్లో 89.45 మీటర్ల దూరం బడిసెను విసిరి సిల్వర్ మెడల్‌తో చరిత్ర సృష్టించాడు. అనంతరం సర్జరీ కోసం విరామం తీసుకుంటానని ప్రకటించిన నీరజ్ మనసు మార్చుకున్నాడు. లసానే డైమండ్ లీగ్‌లో పోటీ పడి రెండో స్థానం దక్కించుకున్నాడు.
ఈమధ్యే బ్రస్సెల్స్ వేదికగా జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లోనూ భారీ అంచనాల మధ్య ఈటెను విసిరిన నీరజ్ చోప్రా రెండో స్థానంతో నిరాశపరిచాడు. ఒక్క సెంటీ మీటర్ తేడాతో టైటిల్ కోల్పోయాడు. అయితే.. ఫైనల్లో నీరజ్ విరిగిన చేయితోనే పోటీ పడ్డాడు. నొప్పిని భరిస్తూనే ఈటెన్ విసిరాడు.
కొద్దిలో టైటిల్ కోల్పోయిన భారత బడిసె వీరుడు వచ్చే ఏడాది మరింత బలంతో వస్తానని చెప్పాడు. ఫైనల్లో నీరజ్ మూడో ప్రయత్నంలో బడిసెను 87.86 మీటర్ల దూరం విసిరాడు. జులియన్ వెబర్ 87.97 మీటర్ల దూరంలో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ ఎగరేసుకుపోయాడు.