BCCI : భారత పురుషుల జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాళ్లు క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలకు బీసీసీఐ షాక్ ఇవ్వనుంది. ఈ ముగ్గురి సెంట్రల్ కాంట్రాక్ట్(Central Contract)లో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ‘ఏ ప్లస్’ కేటగిరీలో ఉన్న వీళ్లను 2024-25 సీజన్లో డిమోట్ చేయడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి సమాలోచనలు చేస్తోంది. సీనియర్లు అయిన కోహ్లీ, రోహిత్, జడ్డూల సెంట్రల్ కాంట్రాక్ట్ కుదింపు విషయం తెరపైకి రావడానికి కారణం ఏంటంటే..?
నిరుడు వెస్టిండీస్ గడ్డపై టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ గెలుపొందాక విరాట్, హిట్‌మ్యాన్‌లు పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆల్‌రౌండర్ అయిన జడేజా సైతం వీళ్లను అనుసరిస్తూ వీడ్కోలుకు ఇంతకంటే మంచి సమయం, సందర్భం ఉండదని.. తాను టీ20లకు అల్విదా పలికాడు. దాంతో, అప్పట్నుంచీ ఈ ముగ్గురు వన్డే, టెస్టు జట్టులో మాత్రమే కొనసాగుతున్నారు.
అయితే.. బీసీసీఐ నిబంధనల ప్రకారం మూడు ఫార్మాట్లలో ఆడేవాళ్లకే ఏ ప్లస్ సెంట్రల్ కాంట్రాక్ట్ వర్తిస్తుంది. అందుకే.. ఈసారి వార్షిక కాంట్రాక్టుల జాబితాలో కోహ్లీ, రోహిత్, జడేజాలను ఏ ప్లస్ నుంచి ఏ గ్రేడ్‌కు మార్చే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే.. ప్రస్తుతం ఏటా రూ.7 కోట్లు ఆర్జిస్తున్న ఈ త్రిమూర్తులు.. ఇకపై రూ.5 కోట్లు మాత్రమే అందుకోనున్నారు. అయితే.. టీ20, వన్డే, టెస్టులు ఆడుతున్న పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఏ ప్లస్ కేటగిరీని నిలబెట్టుకుంటాడని సమాచారం.
సీనియర్ల సెంట్రల్ కాంట్రాక్ట్ కుదింపుతో పాటు కుర్రాళ్లకు భారీగా ఆదాయం దక్కనుందని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన శుభ్‌మన్ గిల్‌ను బీ కేటగిరీ నుంచి ఏ విభాగానికి మారనున్నాడు. ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌కు, అక్షర్ పటేల్‌కు బీ కేటగిరీలో చోటు ఖాయమంటున్నారు క్రికెట్ నిపుణులు.
ఐపీఎల్లో అదరగొట్టి భారత జట్టులోకి వచ్చిన.. నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రానా, అభిషేక్ శర్మల పేర్లు కూడా సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉండే వీలుంది. ఇక.. నిరుడు బీసీసీఐ ఆగ్రహానికి గురైన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లు దేశవాళీలో, ఐపీఎల్ 18వ సీజన్లో దంచి కొడుతున్నారు. కాబట్టి ఈ ఇద్దరు మళ్లీ కాంట్రాక్ట్ దక్కించుకోవం పక్కా అనిపిస్తోంది. ఇప్పటికే మహిళా క్రికెటర్లకు వార్షిక కాంట్రాక్ట్‌లు ప్రకటించిన విషయం తెలిసిందే.