మక్తల్, మార్చి 27: తాగునీటి ట్యాంకుల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టాల్సిన పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నది. మురుగులోనే తాగునీరు పట్టుకోవాల్సిన పరిస్థితి మక్తల్ మండలం ఉప్పరపల్లి గ్రామంలో వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయానికి సమీపంలో ఉన్న తాగునీటి ట్యాంకు వద్ద డ్రైనేజీలోని మురుగు నీరు ప్రవహిస్తున్నది. దీంతో అ పరిసర ప్రాంతాలు దుర్గంధం వెదజల్లుతున్నదని అక్కడే మంచినీళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని గ్రామస్తులు వాపోతున్నారు.
నిత్యం గ్రామంలో పారిశుద్ధ్యన్ని పరిశీలించాల్సిన పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వీడి తాగునీటి ట్యాంకు వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.