KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో అందాల పోటీలు ఆపేసి.. ఆ నిధులతో అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వండి అని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని కేటీఆర్ మండిపడ్డారు.
శాసనసభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఎడ్యుకేషన్ బడ్జెట్ 15 శాతం అని చెప్పి ఏడున్నర శాతం పెట్టారు. విద్యా భరోసా కార్డు ఇస్తాం అన్నారు. పిల్లలు ఫీజు కట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ దేవుడెరుగు కానీ ఉన్న గురుకుల పాఠశాలలను కాపాడండి. గురుకుల విద్యార్థులు విషాహారంతో బాధపడుతున్నారు.. వాళ్ల గురించి పట్టించుకోవడం లేదు. అద్దె చెల్లించక గురుకులాలు మూతబడుతున్నాయి. విదేశీ విద్యను నిర్లక్షం చేస్తున్నారు. ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు 1800 కోట్లు ఉంటే కట్టాం. ఇప్పుడు 8 వేల కోట్లు ఉన్నాయి.. వాటిని చెల్లించాలని కోరుతున్నాం. అందాల పోటీలు మానేసీ స్కూటీలు ఇవ్వండి.. 500 కోట్లు పెడితే కొందరికైనా స్కూటీలు వస్తాయి అని కేటీఆర్ పేర్కొన్నారు.
2 లక్షల ఉద్యోగాల గురించి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. 11 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మేం ఇచ్చిన వాటికి కాగితాలు ఇచ్చారు. గ్రూప్-1 పోస్టులు వెయ్యికి పెంచుతామని చెప్పి చేయలేదు. గ్రూప్-2 పోస్టులు 2 వేలు చేస్తామన్నారు చేయలేదు. జీవో 46 రద్దు చేయలేదు. జీవో 29 తెచ్చి బలహీనవర్గాల నోట్లో మట్టి కొట్టారు. 20 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు చేయలేదు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసింది.. 11 వేల ఉద్యోగాలు మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు.