BCCI : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ముగియగానే ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది టీమిండియా. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు(BCCI) కీలక నిర్ణయం తీసుకోనుంది. టీమిండియా సహాయక సిబ్బందిని కుదించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌తో పాటు అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ కుమార్‌లను తొలగించేందుకు మొగ్గు చూపుతోందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం భారత జట్టుకు హెడ్‌కోచ్ గౌతం గంభీర్.. అతడికి సహాయకంగా అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ నైపుణ్యాలు పెంపొందించేందుకు టి. దిలీప్ కుమార్.. బౌలింగ్ కోచ్‌గా మొర్నీ మోర్కెల్ సేవలందిస్తున్నారు. అయితే.. టీమిండియాకు కోచింగ్ సిబ్బందిలో ఇంతమంది అవసరం లేదని బీసీసీఐ భావిస్తోంది. దాంతో, ఒకరిద్దరిని తప్పించేందుకు సన్నాహకాలు చేస్తుంది. ఇదే విషయమై చర్చించేందుకు కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సమావేశం కానున్నారు. ఈ మీటింగ్ అనంతరం సిబ్బంది కోతపై నిర్ణయం వెలువడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
🚨 GAUTAM GAMBHIR ON A MISSION 🚨
– Head Coach Gautam Gambhir wants to travel with India A to England as he wants to plan for the England tour & future programs in Tests. [Arani Basu from TOI] pic.twitter.com/0VWNlN9ECx
— Johns. (@CricCrazyJohns) March 12, 2025
నిరుడు టీ20 వరల్డ్ విజయానంతరం గౌతం గంభీర్ భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. బీసీసీఐ వారించినా వినకుండా తన సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు గౌతీ. తనతో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు పనిచేసిన అభిషేన్ నాయర్, రియాన్ టెన్ డస్చేట్లను సహాయక కోచ్‌లుగా తీసుకున్నాడు. వీళ్ల జీతభత్యాలకు భారీగానే ఖర్చు చేయాల్సి వస్తోంది.
గౌతీ టీమ్‌లో ముగ్గురు అనుభవజ్ఞులు ఉన్నాసరే రోహిత్ సేన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయింది. అందుకే.. జంబో కోచింగ్ స్టాఫ్‌ను కుదించేందుకు బీసీసీఐ పావులు కదుపుతోంది. అదే జరిగితే గంభీర్‌కు పెద్ద షాక్ తగిలినట్టే. ఐపీఎల్ 18వ సీజన్ అనంతరం భారత జట్టు ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. జూన్ 20న ఇరుజట్ల మధ్య మొదటి టెస్టు జరుగనుంది.