జైపూర్: ప్రభుత్వ ఆసుపత్రిలోని శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో డాక్టర్, నర్సింగ్ సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. ఇది ఘర్షణకు దారి తీయడంతో వారి మధ్య కోట్లాట జరిగింది. (Brawl Between Doctor And Nursing Staff ) సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం జవహర్లాల్ నెహ్రూ హాస్పిటల్‌లోని ఎన్ఐసీయూలో డాక్టర్ చంద్రప్రకాష్ డ్యూటీ నిర్వహించారు. మహిళా నర్సు మాస్క్ ధరించకుండా పని చేయడంపై మందలించారు. అలాగే నర్సింగ్ సిబ్బందికి కొన్ని పనులు అప్పగించారు.
కాగా, డాక్టర్ చంద్రప్రకాష్ చెప్పిన పని చేసేందుకు మేల్ నర్సు సురేష్ నిరాకరించాడు. దీంతో అతడ్ని ప్రశ్నించడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో సురేష్ దూకుడుగా ప్రవర్తించాడని, చెప్పు, ఐరన్ ప్లేట్‌తో తనను కొట్టాడని డాక్టర్ చంద్రప్రకాష్ ఆరోపించారు. తాను ప్రతిఘటించకుండా ఇతర నర్సింగ్ సిబ్బంది తనను అడ్డుకున్నట్లు ఫిర్యాదు చేశారు.
మరోవైపు డ్యూటీ అసైన్మెంట్ సమయంలో డాక్టర్ చంద్రప్రకాష్ దురుసుగా ప్రవర్తించారని, కొందరిని తిట్టినట్లు మేల్ నర్సు సురేష్ ఆరోపించాడు. ప్రతిగా ఆ డాక్టర్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం ఈ సంఘటనపై స్పందించింది. ఇరు వర్గాల ఫిర్యాదులపై విచారణ కోసం సీనియర్ డాక్టర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
కాగా, ఆ కమిటీ ఏకపక్షంగా వ్యవహరిస్తే సమ్మెకు దిగుతామని నర్సింగ్ సూపరింటెండెంట్ హెచ్చరించారు. అయితే శిశువుల ఐసీయూలో డాక్టర్, నర్సింగ్ సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Ajmer, Rajasthan: A dispute erupted between nursing staff and resident doctors at Jawaharlal Nehru Hospital, over a mask and cap issue in the neonatal intensive care unit. The altercation escalated to a physical fight. Both parties have filed complaints, and the hospital… pic.twitter.com/jDLCsFUWji
— IANS (@ians_india) March 27, 2025