BCCI : ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలాని (IPL Mega Auction 2025)కి సమయం దగ్గరపడుతోంది. అయినా కూడా పద్దెనిమిదో సీజన్ కోసం ఎంతమంది ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చే అనే అంశంపై స్పష్టత రాలేదు. ఆగస్టు నెలాఖరు లోగా ఏదో ఒకటి తేల్చేస్తామని చెప్పిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. సెప్టెంబర్ నెలాఖరు వరకూ బీసీసీఐ ఈ అంశాన్ని వాయిదా వేసింది. దాంతో, రిటెన్షన్ గురించి ఫ్రాంచైజీ యజమానుల్లో టెన్షన్ మొదలైంది.
ఐపీఎల్ మెగా వేలం ఈ ఏడాది డిసెంబర్లో జరుగనుంది. అందుకని ఎవరిని వదిలించుకోవాలి? ఎవరిని అట్టిపెట్టుకోవాలి? అనే అంశంపై ఫ్రాంచైజీలు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశాయి. బీసీసీఐ నుంచి ప్రకటన రావడమే ఆలస్యం తమ రిటెన్షన్ జాబితాను వెల్లడించేందుకు అన్ని జట్ల యజమానులు సిద్ధంగా ఉన్నారు. కానీ, ఈ వ్యవహరాన్ని బీసీసీఐ ఇంకా నాన్చుతూ వస్తోంది.
అయితే.. 18వ సీజన్ కోసం ఒక్కో ఫ్రాంచైజీకి కనీసం నాలుగు నుంచి ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఇవ్వనున్నట్టు విశ్వసనీయ వర్గాల భోగట్టా. సెప్టెంబర్ 29వ తేదీన బెంగళూరులో బీసీసీఐ కార్యవర్గ సమావేశం జరుగనుంది. అప్పుడే రిటెన్షన్ విధానంపై స్పష్టత రానుందని సమాచారం. మరో విషయం ఏంటంటే.. ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకొనే ఆటగాళ్ల పేర్లను వెల్లడించేందుకు నవంబర్ 15 వరకూ సమయం ఉంది