IPL 2025 : సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 18వ సీజన్‌ను వారం పాటు వాయిదా పడింది. వారం తర్వాత పరిస్థితి ఏంటీ? అనేది ఇప్పుడు అభిమానులతో పాటు ఫ్రాంచైజీ యజమానులకు అంతుచిక్కడం లేదు. అయితే.. బీసీసీఐ(BCCI) మాత్రం త్వరలోనే మిగతా 16 మ్యాచ్‌లకు కొత్త షెడ్యూల్ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. త్వరితగతిన టోర్నీని నిర్వహించడంపై దృష్టి సారించిన భారత బోర్డు.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశముంది. వాటిలో ఆసియా కప్(Asia Cup) ఆతిథ్యాన్ని వదులుకోవడం ఒకటి.
ఇక రెండోది బంగ్లాదేశ్‌తో పర్యటన(Bangladesh Tour)ను రద్దు చేసుకోవడం. వీటిలో ఏదో ఒకటి సాధ్యమైనా ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో 18వ సీజన్ తదుపరి మ్యాచ్‌లు ఆడించేందుకు వీలుంటుంది. ఇంతకూ.. బీసీసీఐ వ్యూహం ఫలించేనా? అనేది అందరినీ ఆలోచింపజేస్తుంది.
TATA IPL 2025 suspended for one week.
More details here 👇👇 | #TATAIPL
— IndianPremierLeague (@IPL) May 9, 2025
‘దేశంలో నెలకొన్న పరిస్థితులు.. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఐపీఎల్‌ను వారం పాటు వాయిదా వేశాం. ప్రస్తుతానికైతే లీగ్ నిర్వహణపై తుది నిర్ణయానికి రాలేదు. అయితే.. ఈ మూడు రోజుల్లో ఏం జరుగుతుంది? అనేది ఆసక్తిగా గమనిస్తున్నాం. పరిస్థితులు చక్కబడ్డాక కొత్త షెడ్యూల్ ప్రకటిస్తాం’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయని క్రిక్‌బజ్(Cricbuzz) వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ తదుపరి మ్యాచ్‌లను ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో నిర్వహిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా రెండు మూడు డబుల్ హెడర్లు ఆడించడం ద్వారా తక్కువ సమయంలోనే ఐపీఎల్‌ను పూర్తి చేయవచ్చని బీసీసీఐ భావిస్తోందట.
ఆగస్టులో భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అదే సమయంలో ఇంగ్లండ్ వేదికగా ది హండ్రెడ్ లీగ్(The Hundred League) షురూ కానుంది. ఆగస్టు 5 నుంచి 31 వరకు జరిగే ఈ లీగ్ కోసం విదేశీ ఆటగాళ్లు కొందరు ఐపీఎల్‌ను వీడాల్సి రావచ్చు. ఇక సెప్టెంబర్‌లో కరీబియన్ ప్రీమియర్ లీగ్(CPL) ఉంది. ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 21 వరకూ ఈ టోర్నమెంట్ సాగుతుంది.
అయితే.. బీసీసీఐ వినతి మేరకు వెస్టిండీస్ బోర్డు సీపీఎల్ తేదీలను మార్చే అవకాశం ఉంది. కానీ, భారత బోర్డు మాత్రం ఆసియా కప్ ఆతిథ్యం వదులుకోవడం లేదా తటస్థ వేదికపై జరిపించడం ద్వారా.. ఐపీఎల్‌ను విజయవంతం చేసే అవకాశముంది. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ 17వ ఎడిషన్ తేదీలు, వేదికలో మార్పు చేర్పులపై బీసీసీఐ ప్రతిపాదన చేస్తే.. అందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.