Renu Desai | కొన్నాళ్లుగా పాకిస్తాన్ దుశ్చర్యలని భరిస్తూ వచ్చిన భారత్ ఇప్పుడు యుద్ధానికి దిగింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో 9 స్థావరాలపై దాడులు చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులని మట్టుబెట్టింది. ఆ తర్వాత పాకిస్తాన్ భారత్‌పై యుద్ధానికి దిగింది. ఉగ్రవాదులపై దాడి చేస్తే.. పాక్ ఏకంగా యుద్ధానికి కాలు దువ్వుతూ.. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. సామాన్య పౌరుల ఇళ్లను కూడా లక్ష్యంగా చేసుకొని దురుసుగా వ్యవహరిస్తుంది. ఫైటర్ జెట్లతో డ్రోన్లతో క్షిపణులతో భారత సైనిక స్థావరాలపై దాడి చేస్తుంది. వాటన్నింటిని భారత్ తిప్పికొడుతుంది. అయితే భారత్ దూకుడికి పాక్ కాస్త తలొగ్గినట్టు కనిపిస్తుంది.
అమెరికా సహా పలుదేశాల నుంచి పాక్‌పై ఒత్తిడి రావడం, భారత్‌కు ప్రపంచదేశాల మద్దతు పెరుగుతుండడంతో పాక్ కాస్త వెనకడుగు వేస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో సామాన్య పౌరులు కూడా అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైన ఉంది. భారత సైనిక దళాల కదలికలు ఎక్కడైనా గమనిస్తే, వాటిని ఫోటోలు తీయడం లేదా వీడియోలు చిత్రీకరించడం అస్సలు చేయవద్దని, అటువంటి సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా, మనకు తెలియకుండానే శత్రువులకు సహాయం చేసినవారమవుతామని ప్రముఖులు హెచ్చరిస్తున్నారు.
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ హల్చల్ చేస్తున్నాయి. కొందరు వార్‌పై ఫన్నీ రీల్స్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో రేణూ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు యుద్ధ పరిస్థితులు తీవ్రతరంగా ఉన్నాయి. కొంత మంది వ్యూస్ కోసం ఫన్నీ రీల్స్, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే కారణం మన సైనికులు. వారి కుటుంబాలు, సరిహద్దుల సమీపంలో నివసించే సైనికులు, దేశంలోని అమాయక పౌరుల బాధని దయచేసి అర్ధం చేసుకోండి . మన ప్రార్ధనలు ఎప్పుడు వారికి అండగా ఉంటాయి. సున్నితమైన సమయంలో ఐక్యంగా ఉండాలి. ఎక్కువ వ్యూస్, లైక్స్ కోసం అలాంటి వీడియోలు చేస్తున్నారు, అలా చేయోద్దంటూ చేతులెత్తి దండం పెట్టే ఎమోజీని షేర్ చేసింది రేణూ.