Sunil Gavaskar: క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar)కు అరుదైన గౌరవం దక్కింది. భారత క్రికెట్‌కు విశేష సేవలందించిన లిటిల్ మాస్టర్ కోసం ప్రత్యేక బోర్డు రూమ్ (Boardroom)ను ఏర్పాటు చేసింది బీసీసీఐ. ముంబైలోని ప్రధాన కార్యాలయంలో 1,000 గవాస్కర్ బోర్డ్ రూమ్‌ను గురువారం బీసీసీఐ ప్రారంభించింది. ఆ వీడియోను ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకుంది బోర్డు. టెస్టుల్లో పదివేల పరుగులు చేసిన మొదటి భారత క్రికెటర్ అయిన సన్నీ గౌరవార్థం ఈ గదిని ఏర్పాటు చేశామని బీసీసీఐ తెలిపింది.
తొలి తరం క్రికెటర్లలో ఒకడైన గవాస్కర్ మేటి ఓపెనర్‌గా పేరు గడించాడు. తన విధ్వంసక ఆటతో అలరించిన సన్నీ.. టెస్టుల్లో 10 వేల పరుగులతో చరిత్ర లిఖించాడు. రిటైరయ్యాక కామెంటేటర్‌గానూ రాణిస్తున్న గవాస్కర్‌కు గురువారం బీసీసీఐ ఊహించని కానుక ఇచ్చింది. అతడి పేరుతో బోర్డ్ రూమ్ ఏర్పాటు చేసింది. గదినిండా గవాస్కర్ ఫొటోలు, అతడి కాలంలో టీమిండియా గెలుపొందిన ట్రోఫీలను పొందుపరిచింది బీసీసీఐ. ఈ సందర్బంగా గవాస్కర్ భావోద్వేగానికి లోనయ్యాడు.
Honouring a legend! 🙌
India great Sunil Gavaskar inaugurates 𝟭𝟬𝟬𝟬𝟬 𝗚𝗮𝘃𝗮𝘀𝗸𝗮𝗿 – a Board Room named in his honour and his iconic milestone at the BCCI HQ in Mumbai 👏 pic.twitter.com/laZI0cBL57
— BCCI (@BCCI) May 15, 2025
‘ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) నాకు తల్లితో సమానం. ఇక బీసీసీఐ అయితే తండ్రి లెక్క. ఈ గౌరవానికి ధన్యవాదాలు. భారత్‌కు ఆడే అవకాశం వచ్చినందుకు.. నన్ను ఈ స్థాయికి చేర్చినందుకు భారత క్రికెట్‌కు రుణపడి ఉంటాను. ఇది నాకు చాలా పెద్ద గౌరవం. ఈ సందర్బంగా బీసీసీఐకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా వంతుగా బీసీసీఐ, భారత క్రికెట్ కోసం ఏదైనా చేయాలనుకుంటున్నా’ అని సన్నీ వెల్లడించాడు. 1000 గవాస్కర్ బోర్డ్‌రూమ్ ప్రారంభోత్సవంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, సెక్రటరీ దేవజిత్ సైకియాలు పాల్గొన్నారు.
ప్రపంచ క్రికెట్లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్ల ఆధిపత్యం నడుస్తున్న రోజుల్లో గవాస్కర్ టీమిండియాకు ఆణిముత్యంలా దొరికాడు. ఓపెనర్‌గా విధ్వంసక ఇన్నింగ్స్‌లతో అందరి దృష్టిని ఆకర్షించడు. 1971 నుంచి 1987 మధ్యకాలంలో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ప్రపంచంలోని గొప్ప బ్యాటర్లలో ఒకడిగా చరిత్రపుటల్లో పేరు సంపాదించాడు.
1987లో పాకిస్థాన్‌తో అహ్మదాబాద్‌లో జరిగిన టెస్టులో సన్నీ 10 వేల పరుగుల మైలురాయికి చేరుకున్నాడు. ఇప్పటికీ భారత్ తరఫున సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక రన్స్ కొట్టిన మూడో క్రికెటర్ అతడే. సచిన్ టెండూల్కర్(15,921 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. రాహుల్ ద్రవిడ్ (13,288 పరుగులు) రెండో స్థానంలో నిలిచాడు.