రామవరం, మే 15 : అర్హులకు న్యాయం చేయండి అంటూ జిల్లాకు చెందిన ఓ మంత్రి అధికారులకు చెప్పడం పాపం అయింది. మంత్రి చెప్పారని అధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరించడంతో దళారులకు ధనాన్ని తెచ్చిపెట్టే పథకంగా మారింది. దీంతో అర్హులు దిక్కులేనివారయ్యారు. అర్హులు అనర్హులవుతున్నారు, అనర్హులు అర్హులవుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం పరిధిలోని వెంకటేశ్ గని ఓపెన్ కాస్ట్ (ఉపరితల బొగ్గు గని) విస్తరణలో భాగంగా మండల పరిధిలోని వనమానగర్, దన్బాద్ పంచాయతీ పరిధిలోని మాయాబజార్, రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని ఎస్ఆర్టీ ఏరియా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి అక్కడ నివసిస్తున్న వారికి గతంలో కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని గంగ హుస్సేన్ బస్తి మ్యాగ్జిన్ పక్కన సింగరేణి సంస్థ పునరావాసంలో భాగంగా ఇంటి స్థలాలను కేటాయించారు. ఆ సమయంలో సర్వే చేసిన అధికారులు తమకు అన్యాయం చేశారంటూ కొందరు యువకులు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.
మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. గత 60 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నామని, తమకు అర్హతలు ఉన్నప్పటికీ లబ్దిదారులుగా పరిగణించకపోవడంతో తాము ఉండేందుకు గూడు లేక అవస్థలు పడుతున్నామంటూ హైకోర్టు ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలమైన ఆదేశాల మేరకు కలెక్టర్ ఆ ప్రాంతంలో నివసిస్తూ అర్హులైన వారిని గుర్తించేందుకు రెవెన్యూ అధికారులకు సర్వే చేయాలని ఆదేశించారు. అందులో భాగంగా రెవెన్యూ అధికారులు ఇటీవల కాలంలో మాయాబజార్లో సర్వే నిర్వహించారు. కానీ వారు 2020-21 ఆర్థిక సంవత్సరం పంచాయతీ డిమాండ్ రిజిస్టర్లు పరిగణలోకి తీసుకోకపోవడంతో, కొందరు వ్యక్తులు దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని ఓసీ వస్తుందన్న నెపంతో తాత్కాలిక అవాసాలు ఏర్పాటు చేసుకుని తామూ ఇక్కడే ఉంటున్నామంటూ అధికారులను తప్పుదోవ పట్టించారు. మరికొందరు సర్వే చేస్తున్న అధికారులు నిష్పక్షపాతంగా సర్వే చేస్తుంటే ఈ ప్రాంతానికి, అసలు ఈ రాష్ట్రానికి చెందని వ్యక్తులను కూడా ఈ ప్రాంతం వారుగా నమోదు చేయాలంటూ జిల్లాకు చెందిన మంత్రినే తప్పుదోవ పట్టించి అధికారులపై ఒత్తిగి చేయించి వారి పేరు నమోదు చేయించుకున్నారని, ఈ వ్యవహారంలో బ్రోకర్లు పెద్ద మొత్తంలో పైసలు వసూలు చేసినట్లు స్థానికులు అంటున్నారు.
గతంలో సెవెన్ ఇంక్లైన్ తీసివేసిన క్రమంలో చాలా మంది రామవరంలో ఇంటి స్థలాలు తీసుకుని లబ్ది పొంది, ఇదే అదునుగా భావించి మళ్లీ ఈ ప్రాంతంలో ఉంటూ స్థలం తీసుకున్నారని, ఒక వ్యక్తి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది రెండోసారి కూడా లబ్ధి పొందుతున్నాడని ఇదెక్కడి న్యాయమని, పలుకుబడి, అండ బలం, ఆర్థిక బలం ఉన్న వారికి ఇంటిస్థలాలు వస్తున్నాయనీ, అన్ని అర్హతలు ఉండి ప్రభుత్వ నుండి ఎలాంటి లబ్ధి పొందని తమకు ఏమీ లేనివారికి జాబితాలో పేర్లు కూడా ఉంచడం లేదని వాపోతున్నారు, ఇప్పటికైనా అధికారులు రాజకీయాల ఒత్తిడికి లోను కాకుండా ప్రలోభాలకు గురి కాకుండా నిష్పక్షపాతంగా వెంకటేశ్ గని ఓసి విస్తరణలో గూడు పోగొట్టుకుంటున్న నిజమైన అర్హులను, వారి బాధలను అర్థం చేసుకుని, 2020-21 ఆర్థిక సంవత్సరంలో పంచాయతీ డిమాండ్ రిజిస్టర్లో ఉన్న వారిని పేర్లను అర్హులుగా గుర్తించి, తమకు అర్హత పత్రాలు అందేలా చూడాలని కోరుతున్నారు.
ఈ సర్వే నిర్వహిస్తున్న సమయంలో అప్పుడు విధులు నిర్వహించిన ఆర్ ఐ చేతివాటం గట్టిగానే ప్రదర్శించారని విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరిని దళాలుగా ఏర్పాటు చేసుకుని 30 నుంచి 40 వేలు వసూలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. వసూలు చేసిన పైసలు అధికారికి ఇచ్చారా లేదా అతని పేరు చెప్పి వీళ్లే వాడుకున్నారా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాంటి అర్హత పత్రాలు లేకున్నా పైసలు ఇచ్చారనే అర్హతతోనే వారిని ఇంటి స్థలాల లిస్టులో చేర్చారని, దీంతో నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతుందని మాయాబజార్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమాలపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు.
రెండో దఫా నిర్వహించిన సర్వేలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలుగా ఉండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీ జాబితా నుండి తీసివేసిన ఆంధ్రాకు చెందిన సామాజిక వర్గానికి చెందిన వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని, అంతేకాకుండా ధన్బాద్ సింగరేణి క్వార్టర్లలో ఉంటున్నవారు మాయాబజార్ నిర్వాసితులు ఎట్లా అవుతారు? గతంలో ధన్బాద్ స్కూల్ వద్ద ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం చేపట్టడంతో అధికారులు దానిని కూల్చివేశారు. ఇప్పుడు వారు కూడా ధన్బాద్ లో ఉంటూ మాయాబజార్ నిర్వాసితులయ్యారు? ఒక ఇంట్లో భార్యకి, భర్తకి రెండు ఇంటి స్థలాలు ఎలా వస్తాయి? ధన్బాద్ లో ఉండే వ్యక్తి మాయాబజార్ ప్రాంత నిర్వాసితుడు ఎట్లా అవుతాడు? ఇలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పవలసి ఉంది. పూర్తిగా దళారులను నమ్మి వారిచ్చే మామూళ్లకు ఆశపడి అర్హులు కాకపోయినా అర్హుల జాబితాలో చేర్చడమేమిటని మాయాబజార్ వాసులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై చుంచుపల్లి తాసిల్దార్ కృష్ణను నమస్తే తెలంగాణ వివరణ కోరగా తమ సిబ్బంది పంచాయతీ డిమాండ్ రిజిస్టర్ అనుసరించే సర్వే చేస్తున్నారని ఎవరైనా అక్రమాలకు పాల్పడితే తమ దృష్టికి తీసుకు వస్తే చర్య తీసుకుంటామని ఆయన తెలిపారు