IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ పునరుద్ధరణ తర్వాత నిబంధనలను సడలిస్తున్న బీసీసీఐ (BCCI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తాత్కాలిక ఆటగాళ్లను తీసుకునేందుకు అనుమతిచ్చిన బోర్డు.. ప్లే ఆఫ్స్ నేపథ్యంలో తీపికబురు చెప్పింది. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయాన్ని పెంచుతున్నామని బీసీసీఐ తెలిపింది. ఇప్పటివరకూ ఉన్న అదనపు సమయాన్ని మరోగంటకు పొడిగించింది.
అంటే.. ఇకపై ప్రతి మ్యాచ్‌కు 120 నిమిషాలు ఎక్స్ ట్రా టైమ్ వర్తిస్తుంది. మే 20 నుంచే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మ్యాచ్ వేళల పొడిగింపు విషయంలో క్లాజ్ 13.7.3 ప్రకారం ఈ మార్పులు చేసినట్టు స్పష్టం చేసింది. దాంతో, వర్షం కారణంగా టాస్ ఆలస్యమైనా ఈ రెండు గంటల అదనపు సమయం కలిసి వస్తుందని ఫ్రాంచైజీలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
‘ఇంతకుముందు పరిస్థితులను బట్టి లీగ్ మ్యాచ్‌లకు గంట సమయం అదనంగా కేటాయించేవాళ్లం. ఇప్పుడు ప్లే ఆఫ్స్‌ను దృష్టిలో పెట్టుకొని మరో 60 నిమిషాల్ని చేరుస్తున్నాం. ఒకవేళ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైనా ఈ 120 నిమిషాలు ఆట రద్దు కాకుండా చూసేందుకు ఉపయోగపడుతాయి. మే 17న ఆర్సీబీ, కోల్‌కతా మ్యాచ్ వర్షార్ఫణం అయింది. తదుపరి మ్యాచ్‌లకు వర్ష సూచన ఉన్నందున ఐపీఎల్ కార్యనిర్వాహక మండలి ఈ నిర్ణయం తీసుకున్నాం. మే 20 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌తో ఎక్స్ ట్రా గంట అందుబాటులోకి వస్తుంది.
ఐపీఎల్ 18వ సీజన్లో మూడు ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు కాగా.. చివరి బెర్తుకోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోటీ నెలకొంది. త్వరలోనే ఈ రెండింటిలో నాకౌట్‌కు దూసుకెళ్లే జట్టు ఏదో తేలిపోనుంది. ఈ సమయంలో.. ఫైనల్ వేదికపై నెలకొన్న అనిశ్చితికి బీసీసీఐ తెరదించింది.
కొత్త షెడ్యూల్ ప్రకారం జూన్ 3న జరగాల్సిన టైటిల్ పోరుకు ఈడెన్ గార్డెన్ బదులు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇవ్వనుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి తెలిపింది. వరసగా సమావేశాల అనంతరం చివరకు అహ్మదాబాద్‌లోనే ఫైనల్ ఆడించాలని తీర్మానించింది. ఈ విషయాన్ని మంగళవారం బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. దాంతో, ఇన్నిరోజులుగా మీడియాలో వస్తున్న ఊహాగానాలకు ఎండ్ కార్డ్ పడినట్టైంది.