Minister Duddilla Sridhar babu | రామగిరి, మే 20 : వృత్తి నైపుణ్యత పెంపొందించుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలోని ఎంవీటీసీ నందు సింగరేణి సంస్థ సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ (నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం)ను మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
విశిష్ట అతిథిగా రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమానికి రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు అధ్యక్షత వహించి, సింగరేణి సంస్థ ద్వారా పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతకు వివిధ విభాగాల్లో ఉచితంగా ఇస్తున్న శిక్షణ గురించి తెలియజేశారు.
అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ నిరుద్యోగ యువతీ యువకుల్లో వృత్తి నైపుణ్యత పెంచి, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వివిధ ఏరియాల్లో ఇలాంటి శిక్షణా కేంద్రాలు నిర్వహిస్తుందన్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా సుమారు 36 కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వబడుతుందని, అలాంటి శిక్షణా కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు.
త్వరలో రాష్ట్రంలో స్కిల్ సర్వే..
నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలు పొందాలని ఆకాంక్షించారు. శిక్షణ పొందే అభ్యర్థులు సర్టిఫికెట్ కోసమే కాకుండా, పూర్తిస్థాయిలో శిక్షణ పొంది నిజమైన నైపుణ్యాన్ని సాధించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని, త్వరలో రాష్ట్రంలో స్కిల్ సర్వే నిర్వహించి, నిరుద్యోగులకు వివిధ విభాగాలలో ఉన్నటువంటి నైపుణ్యత ఆధారంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. సింగరేణి యాజమాన్యం ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాన్ని ఒక కళాశాలగా అభివృద్ధి చేసి, ఇక్కడి నుండే నియామకాలు చేపట్టే విధంగా కృషి చేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ జె అరుణశ్రీ, హెచ్ఆర్డీ విభాగం జనరల్ మేనేజర్ గుంజపడుగు రఘుపతి, రామగుండం-1 ఏరియా జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు, గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి కె.రాజ్ కుమార్, ప్రాతినిధ్య సంఘ నాయకుడు కోట రవీందర్ రెడ్డి, అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.నరసింహులు, ఆర్.డి.ఓ. సురేష్, ఎస్వో టు జిఎం బి.వి.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Karimnagar | బొమ్మనపల్లిలో అగ్ని ప్రమాదం.. రూ. 2 లక్షలకు పైగా నష్టం..
Landslides | కైలాస్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన వందలాది మంది యాత్రికులు
Warangal fort | కోటను సందర్శించిన రాజు కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ