Australia ODI Wins : ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా జట్టు సంచలన విజయాలకే కాదు సంపూర్ణ ఆధిపత్యానికి చిరునామా. మూడు ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీ(ICC Trophy)లు కొల్లగొట్టిన ఏకైక టీమ్ ఆసీస్. రికార్డు స్థాయిలు ఆరుసార్లు వన్డే వరల్డ్ కప్ గెలుపొందిన చరిత్ర ఆ జట్టుది. క్రికెట్లో ఘనమైన రికార్డులు, వైభవం ఉన్న కంగారూల బృందం మరో మైలురాయికి
చేరుకుంది. అది కూడా తమకు ఎంతో అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్లో.
అవును.. వన్డేల్లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న ఆస్ట్రేలియా తాజాగా ఇంగ్లండ్‌ను వరుసగా రెండు మ్యాచుల్లో చిత్తు చేసింది. తద్వారా ఈ ఫార్మాట్లో 14 విజయం ఖాతాలో వేసుకుంది. ఈ దెబ్బతో నిరుడు 13 విక్టరీలతో శ్రీలంక(Srilanka) పేరిట ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోయిందనుకో.
Strong return to the Aussie XI for Mitch Starc who won his battles with Harry Brook and – earlier in the week – illness #ENGvAUS pic.twitter.com/DUynZzQbxM
— cricket.com.au (@cricketcomau) September 21, 2024
వన్డేల్లో వరుసగా అత్యధిక విజయాలు సాధించడం ఆస్ట్రేలియాకు ఇదే ప్రథమం కాదు. దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్(Ricky Ponting) సారథ్యంలో 2003 వన్డే వరల్డ్ కప్‌ను అందుకున్న ఆసీస్ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించింది. ఆ ఏడాది ఏకంగా 21 మ్యాచుల్లో ఓటమన్నదే ఎరుగకుండా ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పింది. ఇప్పటి వరకూ ఆ రికార్డు దరిదాపుల్లోకి ఏ జట్టు వెళ్లలేదు. ప్రస్తుతం ఆసీస్ జట్టు ఫామ్ చూస్తుంటే ఆ రికార్డు బద్ధలవ్వడం ఖాయమనిపిస్తోంది.
నిరుడు భారత గడ్డపై వన్డే వరల్డ్ కప్ ముద్దాడిన ఆస్ట్రేలియా విజయపరంపరను కొనసాగిస్తూ వస్తోంది. స్వదేశంలో వెస్టిండీస్‌పై 3-0తో వన్డే సిరీస్ గెలుపొందిన ఆసీస్ వరుసగా 12వ మ్యాచుల్లో జయకేతనం ఎగరువేసింది. ఇప్పుడు ఇంగ్లండ్ పర్యటనలో మిచెల్ మార్ష్ సారథ్యంలోని కంగారూ జట్టు ప్రకంపనలు రేపుతోంది.
తొలి వన్డేలో ట్రావిస్ హెడ్ మెరుపు సెంచరీతో కదం తొక్కగా.. రెండో వన్డేలో కెప్టెన్ మిచెల్ మార్ష్, వికెట్ కీపర్ అలెక్స్ క్యారీలు అర్ధ శతకాలతో రాణించారు. దాంతో, ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. మరో మూడు మ్యాచ్‌లు ఉన్నందున ఆస్ట్రేలియాకు హ్యారీ బ్రూక్ సేన చెక్ పెడుతుందా? సిరీస్ సమం చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.