WhatsApp | ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. తన యూజర్ల కోసం రోజుకో కొత్త ఫీచర్ పరిచయం చేస్తోంది. తద్వారా వాట్సాప్ ను ఆల్-ఇన్-వన్‌గా రూపొందించడానికి కసరత్తు చేస్తున్నది. యూజర్ల భద్రత కోసం ఇప్పటికే పలు ఫీచర్లు తెచ్చిన వాట్సాప్.. తాజాగా ‘థీమ్ చాట్’ అనే ఫీచర్ తెచ్చే పనిలో పడింది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు తమ చాటింగ్‌కు వారికి నచ్చిన థీమ్‌లు జోడించవచ్చు. రంగులతోపాటు నచ్చినట్లు వాట్సాప్ యూజర్లు తమ చాట్ పేజీ రూపొందించుకోవచ్చు. యూజర్ల అనుభవం మెరుగు పర్చడంతోపాటు చాటింగ్ మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఈ ఫెసిలిటీ తీసుకొస్తోంది వాట్సాప్. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలపింగ్ దశలోనే ఉందని ఎప్పటికప్పుడు వాట్సాప్ అప్ డేట్స్ అందించే వాబీటా ఇన్ఫో తన బ్లాగ్ లో తెలిపింది. త్వరలోనే బీటా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని పేర్కొంటూ సంబంధిత స్క్రీన్ షాట్ కూడా షేర్ చేసింది.
వాట్సాప్‌తోపాటు మెటా అనుబంధంగా పని చేసే మరో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాలో స్టోరీ పోస్టు చేస్తున్నప్పుడు తమకు నచ్చిన వ్యక్తులకు ‘@’ సాయంతో ట్యాగ్ చేస్తాం. దీనివల్ల అలా ట్యాగ్ చేసిన వ్యక్తులకు మనం స్టోరీ పోస్ట్ చేసినట్లు నోటిఫికేషన్ వెళడం ద్వారా వారంతా ఈ పోస్ట్ చూస్తారు. అలాగే వాట్సాప్ కూడా ఇటువంటి ఫెసిలిటీని అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. అంటే వాట్సాప్ స్టేటస్ పెడుతున్నప్పుడూ యూజర్లు తమ కాంటాక్ట్స్ లో నచ్చిన వ్యక్తులకు ట్యాగ్ చేయొచ్చు. కానీ, ఇన్‌స్టాలో మాదిరిగా ట్యాగ్ చేసిన వ్యక్తి పేరు వాట్సాప్ స్టేటస్ లో అందరికీ కనిపించదు. యూజర్ల ప్రైవసీకి భంగం కలగకుండా వాట్సాప్ ఈ ఫీచర్ తీసుకొస్తున్నది.