కోల్‌కతా: టీ20 వరల్డ్‌కప్ సూపర్ 8 స్టేజ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్ సంజూ శాంసన్(Sanju Samson) కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఛేజింగ్‌లో 97 రన్స్ చేసి ఇండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సంజూ తన స్ట్రోక్ ప్లేతో ఆకట్టుకున్నాడు. కేవలం 50 బంతుల్లోనే 97 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. 5 వికెట్ల తేడాతో నెగ్గిన ఇండియా .. సెమీస్‌లోకి ఎంటరైంది.
అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత సంజూ తన వడిదిడుకుల జర్నీ గురించి వివరించాడు. సూపర్ 8 ఓపెనింగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఓటమి తర్వాత ఇండియా తన బ్యాటింగ్ బృందంలో మార్పులు చేసింది. ఇద్దరు ఓపెనింగ్ లెఫ్ట్ హ్యాండర్లకు బదులుగా.. ఆ తర్వాత మ్యాచ్‌లో సంజూకు ఛాన్స్ ఇచ్చింది. అయితే ఆ అవకాశాన్ని సంజూ సద్వినియోగం చేసుకున్నాడు. చాలా క్లారిటీతో ఆడేశాడు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన సంజూ.. తన షాట్ సెలెక్షన్ విషయంలో జాగ్రత్త వహించినట్లు చెప్పాడు.
వాస్తవానికి పెద్దగా మార్పులు చేయకపోయినా.. తనలో తాను విశ్వాసాన్ని నింపుకునే ప్రయత్నం చేసినట్లు సంజూ చెప్పాడు. గతంలో ఇదే తరహా బ్యాటింగ్‌తో రాణించానన్నాడు. అయితే కొన్ని ఒడిదిడుకుల నేపథ్యంలో తనపై తనకు నమ్మకాన్ని పెంచుకునేందుకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పాడు. ఫోన్ స్విచాఫ్ చేసినట్లు వెల్లడించాడు. సోషల్ మీడియాను కూడా పక్కన పెట్టేసి, కేవలం తన అంతరాత్మపై దృష్టి పెట్టినట్లు సంజూ తెలిపాడు. అయితే అత్యంత కీలకమైన మ్యాచ్‌లో తన కృషి ఫలించినట్లు బ్యాటర్ సంజూ పేర్కొన్నాడు.
వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఓ వైపు వికెట్లు పడుతున్నా.. సంజూ మాత్రం నిలకడగా రన్స్ రాబట్టాడు. సూర్యకుమార్, తిలక్ వర్మ్‌కు సపోర్టు ఇచ్చాడు. వాస్తవానికి చేజింగ్ కొంత కష్టంగానే సాగిందని, బ్యాటింగ్ లైనప్‌ను అంచనా వేస్తే, ఈడెన్ గార్డెన్లో 190 చేధించడం అంత సులువైన అంశం కాదు అని, కానీ తేమ వస్తే, అప్పుడు బ్యాటింగ్ ఈజీ అవుతుందని, అయితే క్రమంగా వికెట్లు కోల్పోవడంతో ఓ సవాల్ లాంటి పరిస్థితి ఏర్పడినట్లు సంజూ తెలిపారు. నిజం చెప్పాలంటే, ఆ సమయంలోనే తన అనుభవం కీలక పాత్ర పోషించిందన్నారు. మంచి స్టార్ట్ దొరికిందని, కానీ వికెట్లు పడుతున్న సమయంలో ఒకటే ఆలోచించానని, చివరి వరకు క్రీజ్‌లో ఉండి గేమ్‌ను ఫినిష్ చేయాలనుకున్నట్లు చెప్పాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో విఫలమైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ తర్వాత తనకు తాను ఆత్మపరిశీలిన చేసుకున్నట్లు చెప్పాడు. నెగటివ్ ఆలోచనలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసినట్లు వెల్లడించాడు. కివీస్‌తో సిరీస్‌లో బాగా ఆడి, వరల్డ్‌కప్‌లో స్థానం సంపాదించాలని భావించాను, కానీ అలా జరగలేదు. అయితే కొంత గ్యాప్ సమయంలో తనకు తాను ఆలోచించడం మొదలుపెట్టినట్లు తెలిపారు. ఎంతో మంది ఎన్నో రకాల సలహాలు ఇచ్చినట్లు గుర్తు చేశాడు.