Akash Chopra : భారత హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)కు ఆటపట్ల ఉన్న అంకితభావం తెలిసిందే. ఓపెనర్‌గా రికార్డు స్కోర్లు కొట్టిన గౌతీకి కోపం మాత్రం ముక్కుమీదే ఉంటుందని కూడా చదివాం, చూశాం కూడా. అందుకనే ఏమో మైదానంలో ఎంతో దూకుడుగా ఉండే గంభీర్ వివాదాలతో తరచూ వార్తల్లో నిలిచేవాడు. రిటైర్మెంట్ అనంతరం ఐపీఎల్(IPL)లో మెంటార్‌గానూ దుందుడుకుగా వ్యవహరించడం చూశాం. మైదానంలోపలే కాదు బయట కూడా గంభీర్ గొడవకు ఏమాత్రం తగ్గడని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా(Akash Chopra) అన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గంభీర్ ఓసారి లారీ డ్రైవర్‌తో గొడవ పడ్డాడు. దాదాపు అతడికి కొట్టినంత పనిచేశాడు అని చోప్రా తెలిపాడు.
‘ఓసారి ఢిల్లీలో గంభీర్ కారులో వెళ్తున్నాడు. అతడి ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ అనుకోకుండా ఓ దగ్గర మలుపు తీసుకున్నాడు. అంతేకాదు అతడు గంభీర్‌ను తిట్టడం మొదలెట్టాడు. దాంతో, తనకు జరిగిన అవమానంతో రగిలిపోయిన గంభీర్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కోపంతో ఊగిపోయిన అతడు వెంటనే తన కారులోంచి దిగి.. ఆ లారీ డ్రైవర్ చొక్కా కాలర్ పట్టుకున్నాడు. అడ్డదిడ్డంగా లారీ నడపడమే కాకుండా నన్నే దబాయిస్తావా? అని గట్టిగా చివాట్లు పెట్టాడు’ అని ఆకాశ్ చోప్రా గౌతీ కోపం ఏ స్థాయిలో ఉంటుందో వెల్లడించాడు.
అంతేకాదు గంభీర్‌కు తనకు ఓపెనింగ్ స్థానం కోసం పోటీ ఉండేదని కూడా చోప్రా అంగీకరించాడు. క్రికెట్ మీద గౌతీకి పిచ్చి ఫ్యాషన్. సీరియస్గగా కనిపిస్తాడు కానీ, టన్నుల కొద్దీ పరుగులు సాధించాడు. మరో విషయం ఏంటంటే.. నాకు, అతడికి పోటీ ఉండేది. ఓపెనర్ స్థానం కోసం ఇద్దరం పోటీ పడేవాళ్లం. అయితే.. విరాట్ కో(Virat Kohli)హ్లీ, శిఖర్ ధావన్(Shikhar Dhawan)లు వచ్చాక మాకు అవకాశాలు తగ్గాయి. వీరేంద్ర సెహ్వాగ్ సైతం కొన్నిసార్లు నాలుగోస్థానంలో ఆడడం చూశాం అని చోప్రా వివరించాడు.
టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా హెడ్‌కోచ్‌గా ఎంపికైన గంభీర్ స్వదేశంలో తొలి పరీక్షకు కాచుకొని ఉన్నాడు. శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్ విజయం, వన్డే సిరీస్‌లో పరాజయంతో మిశ్రమ ఫలితాలు చవిచూసిన గౌతీ.. ఇప్పుడు సొంతగడ్డపై తన వ్యూహాలకు పదునుపెడుతున్నాడు. చెపాక్ స్టేడియంలో సెప్టెంబర్ 19న తొలి టెస్టు కోసం జట్టును సన్నద్ధం చేస్తున్నాడు.