Aiden Markram : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఒకేఒక్కడు ఆస్ట్రేలియా విజయానికి అడ్డుగోడలా నిలిచాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో 282 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా గెలుపు బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నాడు. వరల్డ్ క్లాస్ పేస్ దళం బుల్లెట్ లాంటి బంతులు సంధిస్తున్నా అదరక బెదరక క్రీజులో పాతకుపోయి.. అలుపెరగని యోధుడిలా సఫారీలను గెలుపు వాకిట నిలిపాడు ఎడెన్ మర్క్రమ్ (Aiden Markram). లార్డ్స్‌లో చిరస్మరణీయ సెంచరీతో తమ జట్టు 27 ఏళ్ల కలను సాకారం చేసిన అతడు.. సెలబ్రేషన్స్ సమయంలో ఒక అభిమాని ఇచ్చిన బీరు తాగాడు. అయితే.. ‘సదరు ఫ్యాన్ మర్క్రమ్కు ఏం అవుతాడు?’ అని మీడియా, ఆన్లైన్ చర్చ మొదలైంది. దాంతో.. తనకు బీరు ఆఫర్ చేసిన వ్యక్తి ఎవరో చెప్పేశాడీ మ్యాచ్ విన్నర్.
‘లార్డ్స్‌లో సూపర్ సెంచరీతో జట్టు విజయంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మ్యాచ్ గెలుపొందిన క్షణంలో ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. ఆ సమయంలోనే స్టాండ్స్‌లోని నా స్కూల్ మేట్ నాకు బీరు ఆఫర్ చేశాడు. మా కల సాకారమైన వేళ.. నేను కూడా వద్దనలేదు. అతడు నన్ను కలిసేందుకు ఎదురు చూశాడు. తీరా దగ్గరకు వెళ్లాక.. ఇదుగో బీరు తీసుకో అన్నాడు. నేను ఓకే.. లెట్స్ చిల్ అన్నాను. అప్పుడు మ్యాచ్ తర్వాత నా తొలి బీరు అది. ఆ తర్వాత చాలా బీర్లు తాగేస్తానని మనసులో అనుకుంటూ ఆ బీరును ఎంజాయ్ చేశా’ అని మర్క్రమ్ వెల్లడించాడు.
“That was one of my mates from school. He wanted me to come over and I said, ‘Flip man, I can’t, it’s too busy, it’s chaos.’ And then he was like, ‘Well, here’s a beer.’ And I was like, ‘OK, I’m in’,” @AidzMarkram said.#WTCFinal #WTC25 #AidenMarkramhttps://t.co/aJ0qJgYwPY
— Circle of Cricket (@circleofcricket) June 15, 2025
డబ్ల్యూటీసీ ఫైనల్లో మర్క్రమ్ అద్భుత సెంచరీతో కదం తొక్కాడు. నిరుడు తన కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ చేజారిందన్న బాధలో ఉన్న అతడు.. ఈసారి ఎలాగైనా జట్టును విజయ తీరాలకు చేర్చడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 282 పరుగుల ఛేదనలో ఆదిలోనే ఓపెనర్ రియాన్ రికెల్టన్(6) ఔటైనా.. పట్టుదలగా ఆడాడు మర్క్రమ్. వియాన్ మల్డర్(27), కెప్టెన్ తెంబ బవుమా(66)లతో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. చిరస్మరణీయ సెంచరీతో జట్టును గెలుపు వాకిట నిలిపిన అతడు 136 పరుగుల వద్ద ఔటయ్యాడు.
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’తో మురిసిపోతున్న మర్క్రమ్
అప్పటికీ విజయానికి 6 పరుగులు అవసరం కాగా.. కైలీ వెర్రినే(4 నాటౌట్), డేవిడ్ బెడింగమ్(21 నాటౌట్)లు లాంఛనం ముగించారు. దాంతో, డబ్ల్యూటీసీలో కొత్త ఛాంపియన్ అవతరించింది. 27 ఏళ్ల కలకు రూపమిస్తూ దక్షిణాఫ్రికా తొలిసారి ఐసీసీ టోర్నీలో విజేతగా ఆవిర్భవించింది. లార్డ్స్‌లో తెంబ బవుమా సారథ్యంలోని సఫారీ జట్ట కొత్త చరిత్ర సృష్టిస్తూ టెస్టు గదను సగర్వంగా అందుకుంది. దాంతో, వరుసగా రెండోసారి విజేతగా నిలవాలనుకున్న కంగారూలకు నిరాశే మిగిలింది.