Vivek Venkataswamy | ఓదెల, జూన్ 15 : పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయాన్ని తెలంగాణ కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదివారం దర్శించుకున్నారు. మంత్రి అయిన తర్వాత మొదటిసారి ఓదెల ఆలయానికి రావడంతో ఒగ్గు కళాకారులు, ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఆలయ ఈవో సదయ్య మంత్రికి స్వామివారి ప్రతిమను అందించి సత్కరించారు. ఓదెలకు చెందిన వివేక్ అభిమాని అల్లం సతీష్ మంత్రి పదవి వస్తే 101 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాడు.
దీంతో ఆదివారం మంత్రి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఆలయానికి ప్రజల సౌకర్యార్థం కాక వెంకటస్వామి సీసీ రోడ్డు నిర్మించినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎంపీ నిధుల నుండి ఆలయ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏఎంసీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్, నాయకులు బండి సదానందం, పశ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్, సాతూరు రవి, అమ్ముల భిక్షపతి, పింగిలి మల్లారెడ్డి, బాలసాని సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.