Deepika Padukone | బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె ఓ కీలక ప్రాజెక్టు నుంచి తప్పుకున్నది. దీనికి ప్రధాన కారణం ఆమె పెట్టిన డిమాండ్లే కారణమన్న వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీపికా పనివేళలతో పాటు రూ.25 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందని ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలపై ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ స్పందించారు. ‘భజరంగీ భాయీజాన్’, ‘చందూ ఛాంపియన్’ తదితర హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు.. దీపికా చేసిన డిమాండ్లు అసాధారణం కావని, న్యాయంగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ‘చిత్ర పరిశ్రమలో పని చేసే వారందరికీ వ్యక్తిగత జీవితం ఉంది. ఆరోగ్యం కూడా ముఖ్యం. స్టార్ హీరోలైన ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ కూడా రోజుకు 8 గంటల షిఫ్ట్ల్లోనే పని చేస్తారు. అలాంటప్పుడు దీపికా చెప్పిన పని గంటల విషయంలో విమర్శలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు’ అని కబీర్ ఖాన్ అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ 12 గంటలకు మించిన షూటింగ్ చేయలేదు. ఆదివారాల్లో షూటింగ్‌లు పెట్టను. నటీనటులు తమ వ్యక్తిగత జీవితాలను పూర్తిగా త్యాగం చేయాలనే ఆలోచనను నేను ఒప్పుకోను’ అని స్పష్టం చేశారు.
రూ.25 కోట్లు పారితోషికం డిమాండ్‌పై కూడా స్పందించిన కబీర్ ఖాన్ ‘ప్రేక్షకాదరణ ఉన్న నటీనటులు తమ మార్కెట్ విలువకు తగిన పారితోషికం కోరడం సహజం. అది వారి స్టార్డమ్ ఆధారంగా నిర్ణయించాలి. వ్యక్తిగతంగా కాదు’ అని పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. దీపికా పదుకొణె మాత్రం ఈ వివాదంపై ఇప్పటికీ అధికారికంగా స్పందించలేదు. అయితే, బాలీవుడ్లో పలువురు ప్రముఖులు ఈ విషయంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వాస్తవానికి సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కనున్నది. ఈ మూవీలో హీరోయిన్గా తీపికా పదుకొణేను తీసుకోవాలని భావించారు. దీనిపై దీపికాను సంప్రదించగా.. భారీగా పారితోషకంతో పాటు 8గంటల షిఫ్ట్‌లోనే పని చేయనున్నట్లు స్పష్టం చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. ‘అధికారికంగా ఒప్పందం చేసుకోకపోయినా..కథ ఎవరికీ చెప్పొద్దనే నియమాన్ని పాటించాలి. నీపై నమ్మకంతో కథ మొత్తం చెప్పాను. కానీ, నువ్వు కథను రివీల్ చేసి నీ నిజస్వరూపం ఏమిటో బయటపెట్టుకున్నావు. ఒక సినిమా కోసం కొన్నేళ్లు కష్టపడాలి. అది నీకు తెలియదు. అర్థం కాదు కూడా. అయినా భయపడేది లేదు. నువ్వు కథ మొత్తం చెప్పినా నాకేమి ఫరక్ పడదు’ అంటూ సందీప్‌రెడ్డి వంగా ఫైర్ అయ్యారు. అయితే, ఓ వెబ్సైట్లో స్పిరిట్ కథ బయటకు వచ్చింది. ఇందులో ఇంటిమేట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయని.. ఏ రేటెడ్ మూవీ అంటూ ఆ సైట్లో పేర్కొనగా.. దీపికా వల్లే మూవీ స్టోరీ బయటకు వచ్చినట్లుగా సందీప్‌రెడ్డి వంగా భావించినట్లుగా పేర్కొంటున్నారు. ఆ తర్వాత మూవీ టీమ్ ‘స్పిరిట్’ మూవీలో హీరోయిన్గా త్రిప్తి డిమ్రిని తీసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.