e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home సిద్దిపేట ఉచిత శిక్షణతో ఉపాధికి తోవ

ఉచిత శిక్షణతో ఉపాధికి తోవ

ఉచిత శిక్షణతో ఉపాధికి తోవ

యువతకు ఉపాధి కల్పన… ఉచిత శిక్షణ
హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ సహకారంతో యువతకు ఉచిత శిక్షణ
పోటీ పరీక్షలకు గ్రామీణ ప్రాంత యువత సన్నద్ధం
నిరుద్యోగ యువతకు కార్పొరేట్‌ స్థాయి శిక్షణ
సిద్దిపేట ఎస్సీ స్టడీసర్కిల్‌ ఆధ్వర్యంలో తరగతులు
పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన శిక్షణ..
హర్షం వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు
ఆర్డీవో జయచంద్రారెడ్డి పర్యవేక్షణ

హుస్నాబాద్‌,ఏప్రిల్‌ 14: గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు పోటీ పరీక్షల్లో నాణ్యమైన శిక్షణ ఇప్పించి వారికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ కృషిచేస్తున్నారు. దీనికి గాను హుస్నాబాద్‌లో ఉచిత శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే సుమారు 50వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ జారీ చేయనున్నది. ఈ నేపథ్యంలో ముందస్తుగా యువతను సిద్ధం చేసేందుకు ఈ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన డిగ్రీ, పీజీ తదితర క్వాలిఫికేషన్స్‌ ఉన్న వారికి ఉచితంగా శిక్షణ ఇప్పించడమే ఈ శిబిరం లక్ష్యం. ఇందులో భాగంగానే హుస్నాబాద్‌ మండల పరిషత్‌ సమావేశ మందిరంలో కొన్ని రోజులుగా నిరాటంకంగా శిక్షణ శిబిరం కొనసాగుతోంది. సిద్దిపేట ఎస్సీ స్టడీ సర్కిల్‌కు చెందిన ప్రతినిధులతో నాణ్యమైన బోధనతో శిక్షణా శిబిరం నడుస్తున్నందున తరగతులకు హాజరవుతున్న అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

స్క్రీనింగ్‌ టెస్టు ద్వారా 250మంది యువతీ యువకుల ఎంపిక
ఉచిత శిక్షణ ద్వారా నాణ్యమైన బోధన అందించడంతో పాటు అనుభవం కలిగిన ఫ్యాకల్టీలతో అన్ని అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. పరిపూర్ణమైన జ్ఞానాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన సెంటర్‌కు స్థానిక ఆర్డీవో జయచంద్రారెడ్డితో పాటు ఇతర అధికారులు మొదట స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహించారు. హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి 500మంది అభ్యర్థులు అర్హత పరీక్ష రాయగా, ఇందులో మెరిట్‌ సాధించిన 250మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరికి పోటీ పరీక్షలకు అవసరమయ్యే సిలబస్‌ను వందశాతం బోధించడం ద్వారా రాబోయే ఉద్యోగ పరీక్షల్లో ప్రతిభను చాటి ఎక్కువ మంది ఉద్యోగాల సాధించేలా సిద్ధం చేస్తున్నారు. ఫిబ్రవరి 6న ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ ఈ ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు.

కార్పొరేట్‌ కోచింగ్‌ సెంటర్‌ను తలపించేలా
నగరాలు, పట్టణాల్లోని కోచింగ్‌ సెంటర్లకు వెళ్లి వేలాది రూపాయల ఫీజులు చెల్లించి చదువుకునే స్థోమత లేని గ్రామీణ ప్రాంత యువతీ యువకులకు ఉచితంగా పోటీ పరీక్షల శిక్షణ ఇస్తున్నారు. కార్పొరేట్‌ కోచింగ్‌ సెంటర్‌లో ఇచ్చే శిక్షణను ఇక్కడ ఇస్తుండడం విశేషం. గ్రూప్‌ 1, 2, 3, 4లతో పాటు ఎస్‌ఐ, పోలీస్‌ కానిస్టేబుల్‌, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీ పరీక్షలకు అభ్యర్థులను సర్వత్రా సిద్ధం చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 5 వరకు తరగతుల నిర్వహణ, అనంతరం స్లిప్‌ టెస్టులు పెడతారు. వారానికి ఒకసారి సబ్జెక్టుల వారీగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. సైకాలజీతో పాటు పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ కోసం నిపుణులను రప్పిస్తున్నారు. అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే జియాగ్రఫీ, ఇండియన్‌ హిస్టరీ, రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం, భారతరాజ్యాంగం, ఆర్థమెటిక్‌, రీజినింగ్‌, ఇంగ్లిష్‌గ్రామర్‌, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్‌ సైన్స్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ తదితర సబ్జెక్టులు బోధిస్తున్నారు.

రోజుకు రూ.12వేల వరకు ఖర్చు
హుస్నాబాద్‌లో జరుగుతున్న ఉచిత కోచింగ్‌ సెంటర్‌కు రోజుకు రూ.10వేల నుంచి రూ.12వేల వరకు ఖర్చు అవుతోంది. శిక్షణ కేంద్రానికి వచ్చే అభ్యర్థులకు తాగునీటి సౌకర్యంతో పాటు మధ్యాహ్నం సమయంలో స్నాక్స్‌ ఇస్తున్నారు. ప్రతి అభ్యర్థికి రోజు రెండు అరటిపండ్లు, సమోస, టీ ఇస్తున్నారు. ఈ ఉచిత శిక్షణ కేంద్రంలో ఫ్యాకల్టీ గౌరవ వేతనాలతో పాటు ఇతర ఖర్చులన్నీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సమకూరుతున్నాయి. ఆర్డీవో జయచంద్రారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ దమ్మని రాము, సిద్దిపేట ఎస్సీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ రమేశ్‌ నేతృత్వంలో శిక్షణ కేంద్రం విజయవంతంగా నిర్వహించబడుతోంది. ప్రస్తుతానికి 60రోజుల పాటు శిబిరాన్ని నడుపనున్నారు. అవసరం మేరకు గడువును పెంచే అవకాశం కూడా ఉంది.

గ్రామీణ యువత స్థిరపడాలనే శిక్షణ

గ్రామీణ ప్రాంత పేద, మధ్య తరగతి యువతీ యువకులు పట్టణ ప్రాంతాలకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేసి కోచింగ్‌ తీసుకునే పరిస్థితిలో లేరు. పట్టణాల్లో అందించే శిక్షణను ఇక్కడే అందించి ఎక్కువ మంది యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడేలా చేయాలనే లక్ష్యంతోనే ఈ ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశాం. స్థానిక అధికారుల సహకారంతో ఖర్చుకు వెనుకాడకుండా శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నాం.
-వొడితెల సతీశ్‌కుమార్‌, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉచిత శిక్షణతో ఉపాధికి తోవ

ట్రెండింగ్‌

Advertisement