శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 02, 2021 , 00:10:58

అగ్గితెగులుతో జాగ్రత్త

అగ్గితెగులుతో జాగ్రత్త

జిల్లాలో 2,23,000 ఎకరాల్లో వరిసాగు 

గత యాసంగిలో అగ్గితెగులుతో రైతులకు భారీ నష్టం 

చేర్యాల, జనవరి 01 : యాసంగి వరి పంట నారుమడి దశలో ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో  నాట్లు వేశారు. ఈ సారి కాలం బాగా కావడంతో యాసంగిలో వరి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉన్నది. జిల్లాలో 2,23,000 ఎకరాల్లో వరిసాగు అవుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.  సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌ డివిజన్లతో పాటు చేర్యాల, దుబ్బాక ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో ఇప్పటికే వరినాట్లు వేయగా మరికొన్ని ప్రాంతాల్లో  నాట్లు వేసే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు.  యాసంగిలో రైతులు ఎక్కువగా యంటీయూ 1010, కేఎన్‌ఎం 118, జేజీఎల్‌ 24423, బతుకమ్మ, తెలంగాణ సోనా ఇతర ప్రైవేటు కంపనీలకు చెందిన రకాలను సాగు చేస్తున్నారు. యాసంగిలో సాగు చేస్తున్న రకాల్లో (తెలంగాణ సోనాకు తప్ప) అగ్గి తెగులను పూర్తిగా తట్టుకొనే శక్తి లేదు. గత యాసంగిలో అగ్గి తెగులు  ఆశించి రైతులకు బాగా నష్టాలను ఎదుర్కొన్నారు.  

ఎలా గుర్తించాలి..

 అగ్గితెగులు ఆశించినప్పుడు ఆకుల పై నూలు కండె ఆకారపు మచ్చలు ఏర్పడుతాయి. మచ్చల చివర్లు మొనదేలి అంచులు మాత్రం ముదురు గోధుమ రంగు, మచ్చల మధ్యభాగం బూడిద రంగు ఉంటుంది.  మచ్చలు పెద్దవై కలిసిపోయి ఆకు అంతటా వ్యాపిస్తాయి.  

 తెగులుకు కారణాలు..

 సాధారణంగా డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి మాసాల్లో రాష్ట్ర వ్యాప్తంగా గాలిలో తేమ శాతం(90%) ఎక్కువగా ఉంటుంది.  రాత్రి ఉష్ణోగ్రతల్లో తగ్గుదల(12 నుంచి 20 సెల్సియస్‌)  మంచు కురవటంతో అగ్గితెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది.

 యాసంగిలో వరిపైర్ల సరిగా ఎదగటం లేదని ఎక్కువ మొత్తంలో నత్రజని ఎరువులను వాడడంతో అగ్గి తెగులు ఉధృతి పెరుగుతుంది.

 వరి హైబ్రిడ్‌ విత్తనోత్పత్తిలో ఆడ, మగ విత్తన రకాల్లో ఏదో ఒకటి అగ్గి తెగులును తట్టుకునే శక్తి లేకపోవటంతో ఉధృతి పెరిగే అవకాశం ఉంది.

 ఒకవైపు అగ్గితెగులు నుంచి పైరును కాపాడడానికి పై మందులు పిచికారీ చేస్తూనే మరొకవైపు యూరియాను వేస్తుంటారు. పైరుకు అగ్గి తెగులు ఆశించినప్పుడు  యూరియాను అధికంగా వాడకంతో ఉధృతి ఇంకా ఎక్కువతుంది.

  తెగులును నారుమడిలో ఆకుమచ్చ దశలో నివారించకపోతే ప్రధాన పొలంలో ఉధృతి అధికమవుతుంది. 


 నివారణ చర్యలు..

  పొలం గట్ల వెంట గడ్డిజాతి కలుపు మొక్కలు(తుంగ, గరిక) వంటివి తొలిగించాలి.

  పొలంలో అగ్గి తెగులు ఉధృతి గమనించినట్లయితే నత్రజని ఎరువును వేయడాన్ని నిలిపివేయాలి. అలాగే చిరుపొట్ట దశలో ఆఖరి దఫా ఎరువును వేసేప్పుడు మొక్కలో రోగనిరోధక శక్తి పెంపొందించడానికి పోటాష్‌ను మ్యూరేట్‌ ఆఫ్‌ పోటాష్‌ రూపంలో ఎకరానికి 10-15 కిలోలు ఆఖరి దఫాగా వేసుకోవాలి.

  తెగులు ఉధృతి తొలిదశలో నారుమడి, ప్రధాన పొలంలో గమనిస్తే ఐసోప్రోథయోలిన్‌ 1.5మి.లీ./లీ, లేదా కాసుగామైసిన్‌ 2.5 మి.లీటర్లు లేదా ట్రైసైక్లోజోల్‌, మాంకోజెబ్‌ను కలిపి 2.5గ్రా.లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

సస్యరక్షణ చర్యలు చేపట్టాలి 

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అగ్గితెగులు సోకేందుకు అనుకూలంగా ఉన్నాయి. జిల్లాలో వరి పంట ఎక్కువగా నారుమడి దశలో ఉంది. రైతులు వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించి  పైరును కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రతి సీజన్‌లో వచ్చే తెగుళ్ల నుంచి రైతుల పంటలు కాపాడేందుకు ముందస్తుగా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఏఈవో గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ రైతులకు పలు సూచనలు చేస్తున్నారు.

-శ్రావణ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి 

VIDEOS

logo