Rana Daggubati | ప్రభాస్ ‘కల్కి 2989 ఏడీ’లో తాను నటిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పేశారు టాలీవుడ్ హల్క్ రానా. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ పాన్ఇండియా సినిమాలో అమితాబ్, కమల్‌హాసన్, దీపికా పదుకొణే, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. వీళ్లతోపాటు రానా కూడా ఇందులో ముఖ్యభూమిక పోషిస్తున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
వీటిపై తన తాజా ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు రానా. ‘నేనూ, డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇద్దరం ఒకటో తరగతి నుంచీ ఫ్రెండ్స్. పైగా తను నా తొలి సినిమా ‘లీడర్’కి శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. మా ఇద్దరి అనుబంధం ఈనాటిది కాదు. అందుకే విదేశాల్లో జరిగిన ‘కల్కి’ ప్రమోషన్స్‌లో పాల్గొన్నాను. దాంతో ఆ సినిమాలో నేనూ ఉన్నట్టు రాసేస్తున్నారు. నిజానికి ‘కల్కి’లో నేను లేను. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను. ‘కల్కి’ సామాన్యమైన సినిమాకాదు. ఈ సినిమాతో ఇండియన్ సినిమా రూపురేఖలు మారనున్నాయి. ‘ఎవెంజర్స్’ స్థాయి సినిమా అవుతుంది’ అని చెప్పారు రానా.