పొంగులేటీ.. తప్పుకో!
అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఎలాంటి భూములనూ నిషేధిత జాబితాలో చేర్చనే లేదం టూ రెవెన్యూ మంత్రి పచ్చి అబద్ధాలు చెప్తున్నరు. దశాబ్దాలుగా పట్టా భూములుగా ఉన్నవి, కాంగ్రెస్ రాగానే ప్రభుత్వ భూములు ఎట్లా అయ్యాయి? దీనికి బాధ్యత వహిస్తూ పొంగులేటి వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి.
– గంగుల కమలాకర్
కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 24: 22-ఏ నిషేధిత జాబితాపై కరీంనగర్ జిల్లా బాధితులు కన్నెర్రజేశారు. పట్టా భూములను ఆ జాబితాలో చేర్చడంపై భగ్గుమన్నారు. ‘మా భూములు మాకివ్వండి’ అని నినదించారు. 10 రోజుల్లో పరిష్కరించండి.. లేదంటే ‘చలో సెక్రటేరియట్’ చేపడుతామని హెచ్చరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా వ్యవసాయ భూములు, ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడంతో ప్రజలు పడుతున్న ఈతిబాధలపై సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ప్రత్యేక కథనం సంచలనం సృష్టించింది.
ఈ మేరకు స్పందించిన బాధితులు సోమవారమే కదంతొక్కారు. 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములు, ఆస్తులను తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు వేలాదిగా తరలివచ్చారు. రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లి (హవేలీ), సీతారాంపూర్, ఆరేపల్లి, కొత్త యాస్వాడ తదితర కాలనీల నుంచి పెద్ద ఎత్తున బాధితులు తరలివచ్చారు. నగరంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు భారీర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి.. అంటూ డిమాండ్ చేశారు. ఏడాదిన్నరగా తమ పట్టాభూములను ప్రభుత్వమే ఆక్రమించేలా జీవోలు తీసుకొస్తే తాము ఎలా బతుకాలని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌కు పాదయాత్ర: గంగుల
కరంనగర్లోని 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చిన ప్రజల పట్టాభూములు, ఆస్తులను 10 రోజుల్లో తొలగించాలని, లేకుంటే ‘చలో సచివాలయం’ కార్యక్రమం చేపట్టి తీరుతామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం 22-ఏ బాధితులతో కలిసి కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన భారీ ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు చేపట్టకపోతే వందలాది మంది బాధితులతో కలిసి రేకుర్తి నుంచి హైదరాబాద్ సచివాలయం వరకు పాదయాత్ర చేపడుతామని హెచ్చరించారు. 22ఏ పేరుతో రేకుర్తి మొత్తం గ్రామాన్ని పూర్తిగా ప్రభుత్వ భూమిగా మార్చి ఏడాదిన్నరగా ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్నారని చెప్పారు.
తాతముత్తాతల నుంచి ఇండ్లు కట్టుకొని అక్కడే నివాసాలు ఉంటున్నారని, అలాంటి భూములను కూడా ఎలాంటి సూచనలు లేకుండానే 22-ఏ కింద చేర్చారని విమర్శించారు. సుమారుగా 60 వేల ఎకరాల భూమిని 22ఏలో చేర్చారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎలాంటి భూములను నిషేధిత జాబితాలో చేర్చలేదని తప్పుడు మాటలు చెప్తూ వచ్చిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. దీనికి బాధ్యత వహిస్తూ పొంగులేటి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏండ్ల తరబడిగా పట్టాభూములుగా ఉన్నవి, కాంగ్రెస్ రాగానే ప్రభుత్వ భూములెలా అయ్యాయని నిలదీశారు.
ప్రజల ఆస్తులను రక్షించడంతోపాటు వారికి భద్రత కల్పించేందుకు బీఆర్ఎస్ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. 22-ఏ సెక్షన్ కాంగ్రెస్ నాయకులు, రెవెన్యూ అధికారులకు ఉపాధి పథకంగా మారిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా వేలాది ఎకరాల భూములను, గ్రామపంచాయతీ, మున్సిపల్ అనుమతితో కట్టుకున్న ఇండ్లను కూడ నిషేధిత జాబితాలో పెట్టి ప్రజల ఉసురు పోసుకుంటున్నదని ఆరోపించారు. ధర్నా అనంతరం బాధితులతో కలిసి కలెక్టర్ చిత్రామిశ్రాకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ పాల్గొన్నారు.

ఇబ్బందులు పెట్టడమే ప్రజాపాలనా?
ప్రజల ను ఇబ్బందులు పెట్టడమే ప్రజాపాలనా? ఏండ్ల కిత్రం మేము భూములను కొన్నప్పుడే రిజిస్ట్రేషన్లు అయినయి. ఆ భూములు ఇప్పుడెందుకు రిజిస్ట్రేషన్లు కావడం లేదు. అప్పుడు పట్టా భూములైతే ఇప్పుడెలా ప్రభుత్వ భూములవుతయి? 10 వేల మంది ప్రజలు పడుతున్న బాధ ప్రభుత్వానికి పట్టదా? వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి. మా బాధలు అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులకు కృతజ్ఞతలు. మా సమస్య తీరేంతరకు అండగా ఉండాలి.
– కృష్ణవేణి, రేకుర్తి బాధితురాలు
ఏడాదిన్నరగా అరిగోస పడుతున్నం
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక రేకుర్తిలోని అనేక సర్వేనంబర్ల భూములను 22-ఏ కింద చేర్చింది. మమల్ని ఏడాదిన్నరగా సర్కార్ అరిగోస పెడుతున్నది. మంత్రులు, జిల్లా అధికారులను కలిసినా మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు. 22ఏను ఎత్తివేసే ఉద్దేశమే ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించట్లేదు. ఏండ్ల తరబడిగా ఇండ్లు కట్టుకొని ఉంటున్న మా భూములు ఇప్పుడెలా ప్రభుత్వ భూములుగా మారుతాయో ప్రభుత్వమే చెప్పాలి. 22ఏలో చేర్చడం వల్ల మా అవసరాల కోసం ఉన్న ఆస్తులను ఆమ్ముకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి. లేకపోతే సచివాలయాన్ని ముట్టడించేందుకూ వెనుకాడేది లేదు.
– పాశం మోహన్‌రెడ్డి, బాధితుల సంఘం జేఎసీ చైర్మన్
30 ఏండ్లనాటి ఇంటికి లోన్ ఇవ్వట్లే..
ముప్పై ఏండ్ల కింత కొత్త యాస్వాడలో భూమి కొని ఇల్లు కట్టుకొన్న. అప్పట్లోనే మున్సిపల్ అధికారులు అనుమతులు ఇచ్చారు. ఇప్పటివరకూ ఎలాంటి సమస్య రాలేదు. ఉన్నట్టుండి ఇప్పుడు 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చడం మాకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. మా పిల్లల ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపేందుకు బ్యాంకు రుణం కోసం వెళ్తే, మా భూములు 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్నాయని రుణం ఇవ్వడం లేదు. కనీసం మాకున్న ఓపెన్ ప్లాట్‌ను అమ్ముకుందామన్నా.. అది కూడా నిషేధిత జాబితాలోనే ఉన్నది. మూడు దశాబ్దాలప్పుడు కొని ఇల్లు కట్టుకొంటే.. ఇప్పుడు నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
– గోనె సుధాకర్ రావు, కొత్త యాస్వాడ