వరంగల్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సారీ చెప్పలేదని మంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేశారని ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు పేర్కొన్నారు. ‘పదవి ఉంటే ఉంటది పోతే పోతది.. సారీ చెప్పమన్నం. ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నదే మాకు ముఖ్యం, ప్రజల గుండెల్లో స్థానం ఉన్నంత వరకు పదవి నుంచి తొలగించే ధైర్యం ఎవరికీ లేదు’ అని తేల్చిచెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం, క్రమశిక్షణా కమిటీ నోటీసులు, ఢిల్లీలో అధిష్ఠానంతో చర్చలు, తదితర పరిణామాల నేపథ్యంలో సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం వరంగల్‌లోని ఓ ఫంక్షన్హాల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశానికి మాజీ మంత్రి కొండా సురేఖతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ ‘అమ్మా.. ఒక్కమాట చెప్పు.. నువ్వు ఏం చెప్పాల్సిన పనిలేదు. కాగితం మీద సారీ.. అని రాసివ్వు’ అంటే ‘పదవి ఉంటే ఉంటది.. పోతే పోతది అని సారీ చెప్పలేదు’ అని స్పష్టంచేశారు. సురేఖది, తనది ఒకటే మాట అని చెప్పారు.
తాను కాంగ్రెస్ పార్టీ మారే ప్రసక్తేలేదని తాజా మాజీ మంత్రి కొండా సురేఖ తేల్చిచెప్పారు. ‘మీరెక్కడికీ వెళ్లొద్దు.. పార్టీ మిమ్మల్ని చూసుకుంటుంది. మీకు తగిన స్థానం కల్పిస్తుంది’ అని తమకు పైనుంచి ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. బీసీలు, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది రాహుల్‌గాంధీ ఆలోచన కానీ, దురదృష్టవశాత్తు తానే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యాయని సు రేఖ ఆవేదన వ్యక్తంచేశారు.
అంతమాత్రాన బాధపడటం లేదని, అకారణంగా తప్పించడమే బాధ కలిగిస్తున్నదని ఆమె చెప్పారు. ఎవరెన్ని ప్రయత్నా లు చేసినా వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పు టికెట్ తనదేనని ధీమా వ్యక్తంచేశారు. త్వరలో కొండా మురళికి మంచి అవకాశం రాబోతున్నదని, అందు కు తమకు సంకేతాలు వచ్చాయని వెల్లడించారు. తాను రాజీనామా చేస్తే పోటీచేయటం కాదు ద మ్ముంటే కార్పొరేటర్‌గా గెలిచి చూపించాలని ఎమ్మె ల్సీ సారయ్యకు సురేఖ సవాల్ విసిరారు.