న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: పశ్చిమాసియా యుద్ధం.. హొర్ముజ్ జలసంధి దిగ్బంధనంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గల్ఫ్ దేశాలు అమెరికాతో స్నేహం చేసి నష్టపోయే కన్నా.. ఇరాన్‌తో రాజీ పడటమే మేలన్న నిర్ణయానికి వచ్చాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా విడిపోయిన టెహ్రాన్-అబుదాబిల మధ్య దౌత్యపరమైన పురోగతికి బీజం పడింది.. దీనికి సంకేతంగా ఇప్పటివరకు జరిగిన సంఘర్షణను పక్కనపెట్టి ముందుకు సాగాలని ఇరు దేశాలు కోరుకుంటున్నట్టు ఇరాన్ అధ్యక్షుడు ఆదివారం వెల్లడించారు.
‘అబుధాబి యువరాజుతో మేం నిర్మాణాత్మకమైన చర్చలు జరిపాం’ అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియన్ తెలిపారు. బ్రిక్స్ సమావేశం నిమిత్తం ఢిల్లీకి వచ్చిన ఆయన అబుధాబి యువరాజు షేక్ ఖలేద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యన్తో చర్చలు జరిపారు. ‘మేం పాత అధ్యాయాన్ని ముగించి భవిష్యత్ వైపు సాగాలని, దానిని కలిసి నిర్మించుకోవాలని అంగీకారానికి వచ్చాం’ అని ఆయన తెలిపారు. కాగా, పశ్చిమాసియా భద్రతపై, సహకారాన్ని పెంపొందించడంపై ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య సోమవారం చర్చలు జరగనున్నాయి.
హొర్ముజ్ జలసంధి భవిష్యత్ గురించి గల్ఫ్ దేశాలు ఇరాన్‌తో చర్చలు జరిపినా తాను లెక్కచేయనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం పేర్కొన్నారు. ఇరాన్ సీనియర్ అధికారులను గల్ఫ్దేశాలు కలవడం వారి ఇష్టం మీద ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.