హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజీ గృహాల లకీడ్రాలో ఎంపికైన 7,340 మందిలో ఇప్పటివరకు 6,643 మంది క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని, 5,521 మందిని అర్హులుగా గుర్తించామని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, హౌసింగ్ కమిషనర్ వీపీ గౌతమ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మిగిలినవారి పరిశీలన కూడా త్వరలో పూర్తిచేసి, నిబంధనల ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు ఈ వారంలోనే అధికారిక కేటాయింపు పత్రాలు జారీ చేస్తామని స్పష్టంచేశారు.
ఇండ్ల కేటాయింపులో బ్రోకర్లు, మధ్యవర్తుల ప్రమేయం ఏమాత్రం లేదని, ఎవరికీ లంచాలు లేదా కమీషన్లు ఇచ్చి మోసపోవద్దని సూచించారు. కేటాయింపు పత్రంలో పేరొన్న అధికారిక బ్యాంకు ఖాతా వివరాల ప్రకారమే మొదటి విడత రుసుం చెల్లించాలని, వ్యక్తిగత ఖాతాలకు నగదు జమ చేయవద్దని తెలిపారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే బోర్డు అధికారులకు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పూర్తి వివరాల కోసం tghb.telangana.gov.in వెబ్ సైట్ లేదా 040-24603572 కాల్ సెంటర్ను సంప్రదించాలని చెప్పారు.