గణపతి అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది విఘ్నాలను తొలగించే దేవుడు. ఏ శుభకార్యమైనా ఆయన పూజతో ప్రారంభించడం భారతీయ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. వినాయకుడి రూపం భారతీయ సంస్కృతిలో అత్యంత సుపరిచితమైన ప్రతీక. వినాయకుడి రూపాన్ని పురాణ విశ్వాసానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రతీకాత్మకంగా, మానసికంగా, జీవశాస్త్ర పరంగా, పర్యావరణ పరంగా ఒకసారి పరిశీలిస్తే అనేక ఆస్తకికరమైన అంశాలు కనిపిస్తాయి.
వినాయకుడి రూపంలో ఏనుగు తల, పెద్ద చెవులు, చిన్న కళ్లు, తొండం, ఏకదంతం, పెద్ద పొట్ట, చిన్న ఎలుక కనిపిస్తాయి. జ్ఞానం, ఏకాగ్రత, అనుకూలత, భావోద్వేగ నియంత్రణ, కోరికల నియంత్రణ, ప్రకృతితో సంబంధం వంటి అనేక మానవ సామర్థ్యాలకు ప్రతీకగా గణనాథుడు కనిపిస్తాడు. త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి అంటే నీవు జ్ఞానమయుడవు, విజ్ఞానమయుడవు అంటూ గణపతి అథర్వశీర్షంలోని ఒక శ్లోకం చెబుతుంది. జ్ఞానం నుంచి విజ్ఞానం వరకు గణపతి తత్వాన్ని శాస్త్రీయ దృష్టితో చదివితే ఈ లక్షణాల వెనక ఉన్న మానవ మెదడు, ప్రవర్తన, పర్యావరణం గురించి ఆధునిక శాస్త్ర పరిశోధనలు నిరంతరం కొనసాగుతున్నాయి.
పార్వతీ తనయుడుగా ఆయన పుట్టుక, గణపతి రూపం వెనక పురాణగాథలు ఉన్నప్పటికీ పురాణాల్లోనే శాస్త్రీయత మేళవించిన విధానం అద్భుతంగా ఆవిష్కృతమవుతుంది. ప్రధానంగా ఆయన రూపంలో ఏనుగు తల ముందుగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. జ్ఞాపకశక్తి, మేధస్సు, పరిసరాలను గుర్తించే సామర్థ్యానికి ఏనుగు పెట్టింది పేరు. ఆధునిక కాగ్నిటివ్ సైన్స్ దృష్టిలో కూడా మేధస్సు అంటే సమాచారం కలిగి ఉండడం మాత్రమే కాదు.. దాన్ని అర్థం చేసుకుని సరైన నిర్ణయంగా మలచగలిగే లక్షణం ముఖ్యమైనది. పెద్ద చెవులు మనకు వినే సంస్కారాన్ని గుర్తు చేస్తాయి. నేటి సమాచార యుగంలో సమస్య సమాచారం లభించకపోవడం కాదు.. అతిగా వస్తున్న సమాచారమే చాలా ప్రమాదకరంగా మారుతున్నది. వార్తలు, సోషల్మీడియా, నోటిఫికేషన్ల మధ్య ఏది అవసరం, ఏది కేవలం శబ్దమో గుర్తించడం ముఖ్యం. అందుకే గణేశుడి చెవులు ఒక ఆధునిక సందేశాన్ని ఇస్తున్నట్లుంటాయి. అన్నీ వినాలి. కానీ అన్నిటినీ నమ్మకూడదు. సరైన నిర్ణయం తీసుకుని వాటిని ఆచరణలో పెట్టడానికి తల, చెవులు కీలకంగా పనిచేస్తాయని గణేశుని తల సంకేతమిస్తుంది.
పెద్ద చెవుల పక్కనే ఉన్న చిన్న చిన్న కళ్లు.. ఏకాగ్రత అనే ముఖ్యమైన అంశాన్ని సూచిస్తాయి. ప్రపంచం మొత్తం మన దృష్టిని ఆకర్షిస్తున్నప్పుడు అవసరమైన విషయాన్ని మాత్రమే స్పష్టంగా చూడగలగడం ఒక గొప్ప సామర్థ్యం. శాస్త్రంలో సిగ్నల్-నాయిస్ మధ్య తేడా ఎంత ముఖ్యమో, జీవితంలో ప్రధానమైనది- అప్రధానమైనది మధ్య తేడా కూడా అంతే ముఖ్యం. వ్యాసభగవానుడు మహాభారత రచనకు సంకల్పించినప్పుడు వినాయకుడు తన దంతాన్ని విరిచి ఘంటంగా ఉపయోగించడానికి ఇచ్చారంటూ పురాణాల్లో ఉన్న ప్రసిద్ధ కథనం. ఏక దంతం జ్ఞానం కోసం త్యాగానికి ప్రతీకగా విలువైన భావాన్ని గుర్తు చేస్తుంది. అంతేకాకుండా జ్ఞానాన్ని నిల్వచేసి తరతరాలకు అందించాలనే నాగరికతా ప్రయాణం కూడా మనకు కనిపిస్తుంది. మనిషి మౌఖిక సంప్రదాయం నుంచి లిపికి, పుస్తకానికి, డిజిటల్ డేటాకు, ఇప్పుడు ఏఐకి చేరుకున్నాడు. ఇక్కడ మారింది సాధనమే అయినా మారనిది మాత్రం జ్ఞానాన్ని నిలుపుకోవాలనే తపన.
గణనాథుని తొండం ప్రకృతిలోని అద్భుతమైన మల్టీటూల్ను గుర్తుచేస్తుంది. శ్వాస, వాసన, స్పర్శ, వస్తువులను పట్టుకోవడం.. ఇలా ఒక్క అవయవం ఎన్నో పనులు చేస్తుంది. నేటి బయోమిమిక్రీ కూడా ప్రకృతిలోని బహుళసామర్థ్యాలను గమనించి రోబోటిక్స్ నుంచి ఇంజినీరింగ్ వరకు ఎప్పటికప్పుడు కొత్త పరిష్కారాలను వెతుకుతున్నది. ఇక లంబోదరుడిలో విశాలమైన పొట్ట మరో అందమైన రూపకం. అది కేవలం సంపదకు మాత్రమే కాకుండా, జీవిత అనుభవాలను జీర్ణించుకునే సామర్థ్యానికి కూడా ప్రతీకగా చూడవచ్చు. గణేశుడి రూపంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఆయన వాహనం ఎలుక. చిన్నది, చురుకైనది, నిరంతరం కదిలేది. మనసు కూడా ఒక ఆలోచన నుంచి మరొకదానికి, ఒక కోరిక నుంచి మరొకదానికి పరుగులు తీస్తుంది. ఈ దృష్టిలో ఎలుక అశాంతమైన మనసుకు ప్రతీకగా కనిపిస్తుంది. దానిపై గణేశుడు అధిష్ఠించి ఉండడం మనసు మన వాహనం కావాలి. మనం మనసుకు వాహనం కాకూడదనే ఒక గొప్ప సందేశమిస్తున్నది. నిరంతరం మన దృష్టిని ఆకర్షించే డిజిటల్ ప్రపంచంలో సెల్ఫ్ కంట్రోల్ అత్యంత అవసరమైన అంశంగా గణపతి రూపం చెబుతుంది.
భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుడిని ఇంటికి తీసుకొస్తాం.. పూజిస్తాం. పత్రి సమర్పిస్తాం. ఉండ్రాళ్లు పెడతాం. గంట మోగిస్తాం. చివరికి నిమజ్జనం చేస్తాం. తరతరాలుగా జరుగుతున్న ఈ ఆచారాల వెనక పురాణ విశ్వాసాలు ఉన్నాయి. అయితే వాటిని ఆధునిక దృష్టితో పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన శాస్త్రీయ, పర్యావరణ, సామాజిక భావనలు కనిపిస్తాయి. మట్టితో రూపం తయారుచేసి పూజించిన తర్వాత నీటిలో కలపడం ఒక అందమైన తాత్విక సందేశం. మట్టి అన్నిటికంటే విశిష్ఠమైనది. జీవనిర్జీవ రాశులన్నిటికీ పుడమి తల్లే ఆధారం. ఆ ప్రకృతికి ప్రతిరూపమైన మట్టికి తను కొలుచుకునే దేవుని రూపాన్ని ఇస్తారు. రూపం శాశ్వతం కాదు.. పర్యావరణ కోణంలో చూస్తే సహజమట్టితో తయారుచేసిన విగ్రహం తిరిగి ప్రకృతిలో కలిసే అవకాశం ఉంది. అందుకే నేడు పర్యావరణహిత గణపతికి ప్రాధాన్యం పెరుగుతున్నది. ప్లాస్టర్, ప్లాస్టిక్, హానికర రసాయన రంగులను తగ్గించడం ద్వారా పండుగను ప్రకృతికి అనుకూలంగా మార్చవచ్చు.
వినాయకచవితితో సహా ప్రముఖంగా చేసుకునే పూజలు, శుభకార్యాలన్నిటిలో ముందుగా పసుపు గణపతికి పూజలు చేస్తారు. భారతీయుల వంటింటి చిట్కాలలో మొట్టమొదటి యాంటీ బయోటిక్ పసుపే. అది సూచించే క్రమంలో ఏ విఘ్నం వచ్చినా తొలగిపోవడానికి, ఎలాంటి అనారోగ్యాకైనా తొలి మందు పసుపుగా చెబుతూ పూజల్లో హరిద్రా గణపతిని ఆరాధించే సంప్రదాయం ప్రారంభమైంది. వినాయకచవితి వర్షరుతువు మధ్యలో వస్తుంది. ఈ సమయంలో అనారోగ్యకరమైన పరిస్థితులు సమాజంలో విస్తృతంగా ఉంటాయి. వర్షాల వల్ల జలాశయాల్లో కొత్తనీరు చేరుతుంది. బ్యాక్టీరియా విస్తృతంగా పెరిగి వైరస్ వ్యాపిస్తుంది. ఈ సమయంలో పూజలు, వ్రతాల సంప్రదాయం ద్వారా మన శరీరానికి కలిగే అనారోగ్య స్థితి నుంచి కాపాడుకోవడానికి పూజా విధానాలు శాస్త్రీయంగా రూపొందాయి.
పూజలో వినియోగించే పత్రి, ప్రసాదాలు ఆరోగ్యానికి హేతువుగా ఉండాలనే సందేశం ఈ పండుగ విధానంలో ఉంటుంది. వినాయకుడి పూజలో ఉపయోగించే పత్రి కూడా అంతే ఆసక్తికరం. 21 పత్రులకు సంబంధించి వినాయకచవితి రాగానే పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఆకులు సేకరిస్తూ వాటిపేర్లు, చెట్లు, వాసనలు తెలుసుకునేవారు. ఇప్పుడు దీనిని ఎథ్నోబోటనీ వంటి శాస్ర్తాలు అధ్యయనం చేస్తున్నాయి. మాచీపత్రి, ములక, మారేడు, గరిక, ఉమ్మెత్త, రేగుపత్రి, ఉత్తరేణి, తులసి, మామిడి, విష్ణుక్రాంత, దానిమ్మ, రేగు, దేవదారు, గన్నేరు, మరువం, వావిలి, జాజి, జమ్మి, మద్ది, జిల్లేడు తదితర ఈ పత్రాలు ఓషధీ విలువలు కలిగినవి. ఈ ఔషధ రకాలకు చెందిన మొక్కలను తాకడం, వాటిని తుంచి సేకరించడం, వినియోగించడం వల్ల ఆరోగ్యకరమైన స్థితిని పొందవచ్చు. తులసి, మారేడు, ఉత్తరేణి వంటి ఆకులను పట్టుకోవడం వల్ల చర్మరోగాలు నశిస్తాయి. మెదడు ఉత్తేజితమవుతుందని పలు పరిశోధనలు తెలిపాయి.
వినాయకచవితి రోజున చేసుకునే పిండి వంటలు కూడా ఆరోగ్యకరమైనవే కావడం విశేషం. ఉండ్రాళ్లు, కుడుములు వినాయకుడికి ఇష్టమైనవి. బియ్యపు రవ్వ, శనగలు, బెల్లం మాత్రం ఉంటే చాలు. వీటిని ఆవిరితో చేస్తాం. ఈ ప్రసాదాలు పూర్తి ఆరోగ్యకరమైన పదార్థాలు కావడం విశేషం కాగా ఇవి తినడం వల్ల ఎలాంటి అజీర్ణ సమస్యలు తలెత్తకుండా ఉంటాయని వైద్యులు చెబుతారు.
గణపతికి సమర్పించే గరికను చూస్తే సాధారణమైన గడ్డిపోచలా కనిపించినా అది తిరిగి పెరిగే సామర్థ్యానికి మంచి ఉదాహరణగా, పడిపోయినా మళ్లీ ఎదగాలనే సందేశానికి ప్రతీకగా చెప్పాలి. అందుకే వినాయకచవితిలో మరో ముఖ్యమైన అంశం సామాజిక బంధం. కుటుంబం కలిసి పూజచేయడం, పిల్లలు పాల్గొనడం, వాడవాడలా సమష్టిగా ఉత్సవాలు నిర్వహించడం ఇదంతా మనుషుల మధ్య అనుబంధాన్ని పెంచే సామాజిక ఆచారంగా చూడాలి. ఫోన్లలో మునిగిపోయిన ఈ కాలంలో ఒక పండుగ కుటుంబాన్ని, సమాజాన్ని ఒకచోట చేర్చుతున్నదంటే అది వినాయక నవరాత్రులకే సాధ్యమైంది.
గణపతిని విఘ్నేశ్వరుడిగా పిలుస్తాం. మనం సాధారణంగా బయట ఉన్న అడ్డంకులను ఊహిస్తాం.. పని ఆగిపోవడం, ప్రయాణంలో సమస్య, పరీక్షలో ఆటంకం, వ్యాపారంలో ఇబ్బంది ఇలా ఎన్నో! అయితే, మనిషి జీవితంలో చాలా అడ్డంకులకు కారణాలు మనలోనే ఉంటాయి. అహంకారం, తొందరపాటు, అవివేకం, తప్పుడు సమాచారాన్ని నిజమని నమ్మడం, తన అభిప్రాయమే అంతిమ సత్యమని భావించడం.. ఇవన్నీ విఘ్నాలే.
వాటిని గుర్తించకుండా బయట ఉన్న అడ్డంకులను తొలగించినా సమస్య పూర్తిగా పరిష్కారం కాదు. అందుకే గణపతిని చూస్తూ నిర్విఘ్నం కురుమే దేవా అంటూ విఘ్నాలను తొలగించమని కోరడం భక్తి భావన అయితే, అడ్డంకి ఎక్కడుందో గుర్తించే బుద్ధిని ఇవ్వు అని కోరడం ఒక మానసిక పాఠం. గణపతి పురాణం మనకు జ్ఞానం, వివేకం, విఘ్నాలను అధిగమించే సామర్థ్యాన్ని గుర్తుచేస్తుంది. శాస్త్రం ఆ సామర్థ్యాన్ని ఎలా పరిశీలించాలో నేర్పుతుంది. సాంకేతికత దాన్ని ఎంతదూరం తీసుకెళ్లవచ్చో చూపిస్తుంది. అందుకే శాస్త్రం మనకు ప్రపంచాన్ని అర్థం చేసుకునే శక్తిని ఇస్తే, పురాణం ఆ శక్తికి అర్థాన్ని వెతికే అవకాశం కల్పిస్తుంది. ఈ రెండిటి మధ్య నిలబడి ఏ శక్తిని ఎందుకు ఉపయోగించాలో నిర్ణయిస్తే శాస్త్రం-పురాణాల మధ్య సమన్వయం కుదురుతుంది. ఇది గణపతితత్వంలో స్పష్టంగా ఆవిష్కృతమవుతుంది.
విఘ్నాలను తొలగించే దేవుడుగా గణపతిని పూజించడం ఒక విశ్వాసం కాగా, సమస్యను గుర్తించి దాని మూలాన్ని అర్థం చేసుకుని పరిష్కారం కనుగొనడం శాస్త్రీయ పద్ధతి. కొత్త ఆలోచనకు ముందు మనసును సిద్ధం చేసుకోవడం మానవజ్ఞానం. ఈ మూడు ఒకచోట కలిసినప్పుడు గణపతి కేవలం ఒక పురాణపాత్రగా కనిపించడు. మనిషి తన మేధస్సును ఎలా ఉపయోగించుకోవాలనే ప్రశ్నకు సాంస్కృతిక ప్రతీకగా కనిపిస్తాడు. అందుకే వినాయకచవితికి ఓం గం గణపతయే నమః అంటూ విఘ్నాలను తొలగించు స్వామీ.. వాటిని గుర్తించే వివేకాన్ని ఇవ్వు స్వామీ.. అని కోరుకుంటే చాలు.
ఇదే గణపతిలోని అసలైన విజ్ఞానం.
-రంగనాథ్ మిద్దెల 9866573461