న్యూఢిల్లీ : తన భూమి కోసం 37 ఏండ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నానని ప్రధాని మోదీకి ఆయన బాల్య స్నేహితుడు ఫిర్యాదు చేశారు. పీఎంవో వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని మీరారోడ్ ప్రాంతానికి చెందిన అస్గర్ అలీ (81) బాల్యంలో గుజరాత్లోని వద్ నగర్లో మోదీతో కలిసి చదువుకున్నారు. ఆయన ఇటీవల మోదీని కలిసి.. తాను 1989లో ముంబై భాయందర్ ఈస్ట్ పరిధిలోని నవ్ఘర్ ప్రాంతంలో సుమారు 2,810 చదరపు మీటర్ల భూమిని కొన్నానని చెప్పారు.
కానీ 2011లో స్వయం బిల్డర్స్, స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర మెహతాకు చెందిన ‘సెవెన్ ఎలెవన్ కన్స్ట్రక్షన్’ సంస్థలు తమ భూమిని కబ్జాచేశాయని వోహ్రా ఆరోపించారు. దీనిపై కోర్టులో పిటిషన్ వేయగా.. ఏండ్లుగా విచారణ సాగుతోందని.. కోర్టులు, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నానని వెల్లడించారు. విచారణ జరిపించి న్యాయం చేయాలని ప్రధాని మోదీని కోరారు. పీఎంవో ఆదేశాలతోమున్సిపల్ యంత్రాంగం ఆ రెండు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.